
తమిళనాడులో సినిమాలు, రాజకీయాలు ఒకదానికొకటి పెనవేసుకుని సాగుతుంటాయి. రాజకీయ నాయకులు తమ ప్రచారానికి సినిమాను ఒక ముఖ్య సాధనంగా వినియోగించడం చారిత్రకంగా వస్తోంది. వెండితెర వెలుగులు రాజకీయాల్లోకి ప్రసారమవుతుంటాయి. గతంలో తమిళనాడులో ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ విధంగా వెలుగులోకి వచ్చిన వారే. ఈ అనుబంధంలో సమయానుకూలంగా కొన్ని విషయాలు కష్టంగా మారవచ్చు. తమిళనాడులో సినిమాలు తరచుగా సెన్సార్ బోర్డుతోను లేదా ప్రభుత్వాలతోనూ సంఘర్షణ పడడం కొత్తేమీ కాదు. తాజాగా రెండు సినిమాలు రాజకీయ దుమారంలో చిక్కుకోవడం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. తమిళగ వెట్రి కజగం పార్టీతో తమిళనాడులో రాజకీయ సంచలనం రేకెత్తిస్తున్న నటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నటించిన చివరి సినిమా జననాయగన్ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో చివరలో సిబిఎఫ్‌సి అడ్డంకితో ఆగిపోవడం తీవ్ర వివాదంగా మారింది. 2025 డిసెంబర్ మధ్యలో ఈ చిత్రాన్ని సిబిఎఫ్‌సి స్క్రూటినీ చేసింది. ప్రతిపాదించిన అంశాలు ఎడిట్ అయ్యాయి.
ఈ చిత్రం లోని కొన్ని అంశాలు మతపరమైన మనోభావాలను గాయపరిచాయని, సాయుధ దళాలను ఇందులో తప్పుగా చిత్రీకరించారని, సిబిఎఫ్‌సి లోని ఒక సభ్యుడు వివాదం లేవనెత్తడంతో కోర్టు గుమ్మం ఎక్కవలసి వచ్చింది. నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్ మద్రాస్ హైకోర్టు నుంచి తమకు అనుకూలమైన ఉత్తర్వులను పొందగలగడంతో యు/ఎ 16 + సర్టిఫికెట్ పొందడానికి వీలైంది. కానీ సిబిఎఫ్‌సి అప్పీలు దాఖలు కావడంతో డివిజన్ బెంచ్ మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 21 కి వాయిదా పడింది. పొంగల్‌కు ముందు జనవరి 9 న విడుదల కావలసిన ఈ చిత్రం వారం పొడుగునా జరిగే పొంగల్ వేడుకలకు కూడా విడుదల కాని పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదంపై అత్యవసరంగా జనవరి 12న విచారణ చేపట్టాలని చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నటుడు విజయ్ ఈ వివాదంపై నిశ్శబ్దం పాటిస్తున్నా ఆయన వర్గీయులు, కాంగ్రెస్ నాయకులు, డిఎంకె నాయకులు కూడా సిబిఎఫ్‌సి వైఖరిని తూర్పారపడుతున్నారు. సెన్సార్ బోర్డు తమను మొదటి నుంచి చివరివరకు వేధించి, కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటోందని చిత్ర నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఇది నేరుగా వెన్నుపోటు పొడవడమేనని టివికె ప్రతినిధి ఒకరు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలు రాజకీయ పెత్తనానికి దాసోహమవుతున్నాయనడానికి సిబిఎఫ్‌సియే అసలైన ఉదాహరణ అని నిందిస్తున్నారు.
జననాయగన్ చిత్రాన్ని అడ్డుకోవడం తమిళ ప్రజల గొంతును నొక్కాలని ప్రధాని మోడీ ప్రయత్నించడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించగా, కేంద్రం కీలుబొమ్మలుగా మారిన సిబిఐ, ఐడి, ఐటి వంటి దర్యాప్తు సంస్థల జాబితాలో సిబిఎఫ్‌సి చేరిందని ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత స్టాలిన్ ధ్వజమెత్తారు. డిఎంకె, టివికె మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ స్టాలిన్ ఈ విషయంలో విజయ్‌కు మద్దతుగా నిలవడం విశేషం. జనవరి 10న విడుదల కావలసిన పరాశక్తి సినిమాకు సిబిఎఫ్‌సి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పరాశక్తి చిత్రాన్ని రెడ్‌జైంట్ మూవీ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థను డిప్యూటీ సిఎం ఉదయనిధి స్టాలిన్ స్థాపించారు. తమిళనాడులో 1960 లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమమే ఈ చిత్రంలో ప్రధాన కథాంశం. ఈ చిత్రంలో అన్నాదురైకి ఆపాదించబడిన పదజాలాన్ని తొలగించడమేకాక, హిందీకి సంబంధించిన కొన్ని అంశాలు ఎడిట్ చేశారు. తమిళనాడులో ఇప్పటికీ హిందీ వ్యతిరేక ఆందోళన భావోద్వేగ అంశమే.ప్రముఖ నటుడు కమలహాసన్ 2013 లో తన విశ్వరూపం సినిమా విషయంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. సిబిఎఫ్‌సి క్లియరెన్స్ ఉన్నప్పటికీ ఉగ్రవాదులుగా ఈ చిత్రంలో ముస్లింలను చిత్రీకరించారని ముస్లిం సమాజాల నుంచి తీవ్ర ఆందోళన చెలరేగడంతో 15 రోజుల పాటు విశ్వరూపం చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
అలాగే 2017లో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం కూడా వివాదాలను ఎదుర్కొంది. జిఎస్‌టి, ఆరోగ్య రంగాన్ని ప్రైవేటీకరించడం మెర్సల్ చిత్రం అవహేళన చేసింది. దాంతో సిబిఎఫ్‌సి ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఎడిట్ చేయవలసి వచ్చింది. 2025లో వెట్రిమారన్ రాజకీయ డ్రామా ‘మానుషి’ విచారణలో ఉన్న ఖైదీల చిత్రహింసలను వెలుగు లోకి తీసుకురాగా, సెన్సార్ షిప్ విషయంలో పోరాటం చేయవలసి వచ్చింది. చివరకు మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కొన్ని మార్పులతో యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నటుడు కమలహాసన్ సెన్సార్ విధానంలో లోపాలను ఎత్తి చూపారు. ఫిలిం సర్టిఫికేషన్ ప్రక్రియపై సూత్రప్రాయమైన పరిశీలన జరగాలని, నిర్వచించిన కాలపరిమితులు అనుసరించాలని, పారదర్శకంగా మూల్యాంకనం జరగాలని, చిత్రంలో ఏవైనా తొలగించాలనుకున్నా, మార్పులు చేయాలనుకున్నా సహేతుకమైన కారణాలతో న్యాయం ఉండాలని తదితర విలువైన సూచనలు జనవరి 10న ఆయన చేశారు. అంతేతప్ప ఇష్టానుసారంగా ఏ కారణాలు లేకుండానే సెన్సార్‌షిప్ సర్టిఫికెట్ ఆపడం లేదా నిషేధించడం జరగకూడదని హెచ్చరించారు. తమిళనాట రాజకీయాలు, సినిమాలు ఏ విధంగా ఆసక్తిని కలిగిస్తాయో అలాగే వివాదాలను కూడా రేపుతుంటాయి. సృజనాత్మక, స్వేచ్ఛాయుత స్ఫూర్తికి రాజకీయ ఒత్తిళ్లు ప్రతిబంధకాలవుతున్నాయి. దానికి అనుగుణంగానే మారవలసి వస్తోంది.