
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఢిల్లీకి చెందిన యువ ఆటగాడు ఆయుశ్ బడోనికి టీమిండియాలో చోటు కల్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడోని ఎంపికను భారత మాజీ క్రికెటర్లు కృష్ణమాచారి శ్రీకాంత్, ఆకాశ్ చోప్రా, గంగూలీ తదితరులు తప్పుపట్టారు. దేశవాళి క్రికెట్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్న క్రికెటర్లను కాదని బడోనిని ఎలా ఎంపిక చేస్తారని వారు ప్రశ్నించారు. దేవ్‌దుత్ పడిక్కల్, సర్ఫరాజ్, రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్ తదితరులు విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో పరుగుల సునామీ సృష్టిస్తున్నారని, వారితో పోల్చితే బడోని ఆటతీరు అంతంత మాత్రమేనని వారు పేర్కొన్నారు. వాషింగ్టన్ స్థానంలో అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్‌రౌండర్‌లను తీసుకుంటే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. ఢిల్లీకి చెందిన క్రికెటర్ అనే ఒకే ఒక కారణంతో అతనికి టీమిండియాలో చోటు కల్పించారని గంగూలీ విమర్శించాడు.