
తెలుగు చిత్ర పరిశ్రమలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్‌తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా ‘వేదవ్యాస్‘. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. నిర్మాత కె.అచ్చిరెడ్డి బర్త్ డేను పురస్కరించుకుని ఆయన పుట్టినరోజు వేడుకలతో పాటు ‘వేదవ్యాస్’ హీరో పిడుగు విశ్వనాథ్‌ను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ “మా ఎస్వీ కృష్ణారెడ్డి ఎంతో పట్టుదలగా తయారుచేసుకున్న స్క్రిప్ట్ ఇది. కొరియా వెళ్లి ఆడిషన్ చేసి కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీని హీరోయిన్‌గా ఎంపికచేశారు.
అలాగే మంగోలియా వెళ్లి విలన్‌ను ఎంపిక చేశారు. ఒక కొత్త హీరో అయితేనే బాగుంటుందని విశ్వనాథ్‌ను తీసుకున్నారు. ఈ సినిమాలో సాయికుమార్… వేద నారాయణ అనే ఒక ప్రధానమైన పాత్రలో నటించారు”అని అన్నారు. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమాలో కొరియన్ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్నాం. ఆమె తెలుగు నేర్చుకుని తన డబ్బింగ్ చెప్పుకుంది. అలాగే మంగోలియా విలన్ బాగా నటించాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయల గొప్పదనాన్ని తెలియజేస్తూ రూపొందిస్తున్న సినిమా ఇది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో పిడుగు విశ్వనాథ్, జర్నలిస్ట్ ప్రభు, పిడుగు సుబ్బారావు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.