Reading Time: 2 minutes

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తాజాగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పించింది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా సంక్రాంతి కానుకగా బుధవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరిం చిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: గోదావరి ప్రాంతానికి చెందిన రాజు (నవీన్ పోలిశెట్టి) పేరుకు జమీందారు కుటుంబ వారసుడే కానీ.. ఆస్తులన్నీ కరిగిపోవడంతో సామాన్యుడిలాగే జీవిస్తుంటాడు. తాను దర్జాగా బతకాలంటే బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే మార్గమని భావించిన రాజు.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతాడు. అనేక సంబంధాలు చూశాక చివరికి పక్క ఊరికి చెందిన జమీందారు కుటుంబానికే చెందిన చారులతని (మీనాక్షి చౌదరి) పెళ్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఆమెను ప్రేమలోకి దించడానికి తన మిత్ర బృందంతో కలిసి అనేక ప్రణాళికలు వేస్తాడు. అవన్నీ ఫలించి చారులత.. రాజును ప్రేమిస్తుంది. చారులత తండ్రి కూడా వీరి పెళ్లికి అంగీకరిస్తాడు. ఇద్దరికీ ఘనంగా వివాహం జరిపిస్తాడు. కానీ పెళ్లి తర్వాతే చారులత కుటుంబం గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది రాజుకు. ఆ విషయం ఏంటి.. అది తెలిశాక అతనెలా స్పందించాడు.. చారులతతో రాజు ప్రయాణం ఎలా సాగింది.. అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ: గోదావరి ప్రాంతంలో ఆడంబరంగా బతికే జమీందారు వారసుడి పాత్రను అణువణువునా ఎక్కించుకుని ఆ పాత్రలో నవీన్ జీవించేయడంతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం అందుతుంది. యువత మాత్రమే కాక ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఎంజాయ్ చేసేలా వినోదాల వల్లరిగా ‘అనగనగా ఒక రాజు’ తెరకెక్కింది. కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఉన్న ఈ చిత్రం సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. చిన్మయి ఘాట్రాజుతో కలిసి నవీన్ పోలిశెట్టి రాసిన స్క్రిప్ట్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచింది. గోదావరి భాష, యాసతో కూడిన పాత్రలో ఒదిగిపోయి చక్కగా నటించాడు నవీన్. జమీందారు వారసుడినంటూ బిల్డప్పులిస్తూ హడావుడి చేస్తూ సాగే తన క్యారెక్టర్ తో త్వరగా కనెక్ట్ అయిపోతాం. ఆ తర్వాత అతడి పెళ్లి ప్రయత్నాలతో కథ మరింత ఊపందుకుంటుంది. హీరోయిన్ని పడేయడానికి అతడు వేసే ప్రణాళికల చుట్టూ నడిచే సీన్లు భలేగా పేలాయి. ఇంటర్వెల్ దగ్గర కథలో ఏదో ఒక మలుపు ఉంటుందని.. హీరోకు షాక్ తగులుతుందని అర్థమైపోతుంది. అందుకు తగ్గ్ల ట్విస్ట్ ఉంటుంది. అది బాగా పేలింది. ఇంటర్వెల్ తర్వాత కూడా ‘అనగనగా ఒక రాజు’ ఫన్ మూడ్ కొనసాగుతుంది. ఇక తన కష్టాలన్నీ తీర్చుకోవడానికి ప్రెసిడెంటుగా పోటీ చేయాలని హీరో నిర్ణయించుకున్నాక రూరల్ పాలిటిక్స్ చుట్టూ కథ నడుస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. మళ్లీ చివరికి నవ్వులతోనే ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటికి పంపిస్తాడు నవీన్ పొలిశెట్టి.