
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం నాడు రాజధానిలో పొంగల్ వేడుకలలో పాల్గొన్నారు. ఇది ప్రపంచం లోని పురాతన నాగరికత మూలాలను గుర్తుచేసే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఎల్. మురుగన్ ఇంట్లో జరిగిన పొంగల్ వేడుకలకు మోదీ హాజరు కావడం రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది ప్రజలకు చేరువయ్యే అంశంగా భావిస్తున్నారు. పొంగల్ పండుగ కొత్త పంట చేతికి వచ్చిన రైతులు, అందుకు తోడ్పడిన భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు అర్పిస్తూ చేసుకునే ఉత్సవం అని ప్రధాని మోదీ అన్నారు.ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సామరస్యం సమతుల్యతను కాపాడుకోవల్సిన ప్రాముఖ్యతను పొంగల్ పండుగ నొక్కి చెప్పిందన్నారు మోదీ.
ప్రపంచ వ్యాప్తంగా తమిళులు దీనిని ప్రపంచ పండుగ గా ఆవిష్కరించారని ప్రధాని అన్నారు. తమిళ సంసృ్కతిని గౌరవించేవారితో కలిసి పొంగల్ పండుగలో పాల్గొనడం తనకు గర్వంగా ఉందని మోదీ అన్నారు. ఈ వేడుకలలో ప్రధాని తో పాటు ఉపరాష్ట్రపతి సి. రాధా కృష్ణన్, కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, కింజారపు రామ్మోహన్ నాయుడు, పలువురు అధికారులు వివిధ వర్గాల ప్రముఖులు, ఈ మధ్య విడుదలైన తమిళ చిత్రం పరాశక్తి తారాగణం… శివకార్తికేయన్, రవి మోహన్, సంగీత దర్శకుడు జివి ప్రకాశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ముందుగా తమిళం, ఆంగ్లంలో రాసిన ఒక లేఖలో పంగల్ సందేశం ఇచ్చారు. తమ కృషితో మన జీవితాలను సుసంపన్నం చేసిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. తమిళ ప్రజలకు పొంగల్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.