Reading Time: < 1 minute

 కుంటల మానెపల్లి, సలుగుపల్లి రహదారిపై నులుకు ఒర్రె వద్ద ఉన్న బ్రిడ్జిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన డోంగ్రె రాజయ్య(58) కుమారుడు డోంగ్రె రాజశేఖర్ (21) కు ఇటీవల కుంటల మానెపల్లికి చెందిన బోర్కుట్ శంకర్ కుమర్తె వరలక్ష్మితో వివాహం కుదిరింది. బుధవారం ఉదయం రాజశేఖర్ తన మామ బోర్కుట్ శంకర్ (48) తో కలిసి చికెన్ కొనుగోలు నిమిత్తం సలుగుపెల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్ళి తిరిగి వస్తుండగా కుంటల మానెపెల్లి గ్రామ శివారులోని నులుకు ఒర్రె బ్రిడ్జి వద్ద అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో వాహనం నియంత్రణ కోల్పోయి బ్రిడ్జిని ఢీకొని కింద పడిపోయింది. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న రాజశేఖర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, వెనుక కూర్చున్న శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో శంకర్‌ను అంబులెన్స్ ద్వారా కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై సర్తాజ్ పాషా తెలిపారు.