Reading Time: < 1 minute

జర్నలిస్టులను అమానవీయ పద్దతిలో చట్టవిరుద్దంగా అరెస్టు చేయడాన్ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. పండుగ పూట ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సి రోజులను గుర్తు చేస్తోందని విమర్శించారు. నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. డిజిపి జర్నలిస్టులను నేరస్థుల్లా చూడటం దురదృష్టకరమని ఆయనన్నారు. అర్ధరాత్రివేళ అరెస్టులు చేయడం సరికాదని, అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేస్తున్నాను. డిజిపి చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని, కాంగ్రెస్ పార్టీ, దాని అసమర్థ నాయకత్వం చేసే మురికి రాజకీయాల్లో భాగస్వాములు కావద్దని హితువు పలికారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో మీడియాపై దమనకాండ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఈ అంశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిని కెటిఆర్ ఖండించారు. రాహుల్ గాంధీ మీ మొహబ్బత్ కీ దుకాన్ తెలంగాణశాఖ పౌరుల రాజ్యాంగ హక్కుల్ని ఎలా కాలరాస్తుందో మీరు గమనిస్తున్నారని ఆశిస్తున్నానని కెటిఆర్ రాహుల్ గాంధీ నుద్దేశించి వ్యాఖ్యానించారు. మీడియా, డిజిటల్ మీడియాపై ఇలాంటి అణిచివేత ఇప్పుడు తెలంగాణలో మీ సహచరుడు రేవంత్ రెడ్డి పాలనకు నిదర్శనంగా మారిందని కెటిఆర్ దుయ్యబట్టారు.