Reading Time: < 1 minute

ప్రతి వారం బిల్లులు చెల్లింపుల ప్రక్రియలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రస్తుతం రూ.152.40 కోట్లను హౌజింగ్ శాఖ విడుదల చేసినట్టు ఎండి విపి గౌతమ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చినాటికి లక్ష ఇళ్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ (హౌసింగ్ కార్పొరేషన్) క్షేత్ర స్థాయిలో పనులు వేగవంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఇంటి నిర్మాణపు పనుల పురోగతిని బట్టి ప్రతి వారం బిల్లులను పూర్తి పారదర్శకంగా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఈ వారంలో 13,861 మందికి బిల్లులను విడుదల చేశామని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 2.50 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని,

వాటిలో సుమారు 1.22 లక్షల ఇళ్ల గోడలు, శ్లాబ్ లు పూర్తయ్యాయని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా ఈ పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటూ, మిగిలిన ఇళ్ల పనులు కూడా మరో మూడు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇందిరమ్మ పథకంలో ఇంతవరకు మొత్తం రూ.4,000 కోట్లకు పైగా నిధులను లబ్ధిదారులకు విడుదల చేశామని ఎండి గౌతం వివరించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరికీ ఎటువంటి లంచాలు ఇవ్వవద్దని, ఈ విధంగా ఎవరైనా డిమాండ్ చేసినా, ఇతర సమస్యలున్నా కాల్ సెంటర్ 1800 599 5991కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.