Reading Time: < 1 minute

డిఎంకె ఎంపి దయానిధి మారన్ ఉత్తరాది మహిళలపై వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బాలికలను చదువుకోమని ప్రోత్సహిస్తుంటే, ఉత్తరాదిలో బాలికలు ఇళ్లలోనే ఉండాలని, వంటచేసుకుంటూ, పిల్లలను కనాలని కోరుతున్నారని దయానిధి మారన్ బుధవారం నాడు అన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దయానిధి మారన్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఎంకె స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం అందరికీ ప్రతీదీ అందించాలని కోరుకునే ఆలోచనతో సాగే ద్రవిడ నమూనా ప్రభుత్వం అని ప్రశంసలు కురిపించారు.

తమిళనాడులో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ల్యాప్ టాప్ ను తీసుకుని బాలికలు, బాలురు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులు చదవాలని, ఇంటర్ వ్యూలకు వెళ్తూ ధైర్యంగా ఉద్యోగాలు చేయాలని ఆశిస్తున్నట్లు మారన్ తెలిపారు. ఇదే సమయంలో ఉత్తరాదిలో బాలికలను చదువులకు పంపరని,పనికి వెళ్లకూడదని అంటారని చెబుతూ వ్యాఖ్యలు చేశారు. ఇది తమిళనాడు, ద్రావిడ నాడు అంటూ , అన్నా, ఎంకరుణానిధి, స్టాలిన్ ను ప్రశంసిస్తూ, తమిళనాడుకు ప్రపంచ స్థాయి కంపెనీలు రావడానికి కారణం ఇక్కడ ప్రతిఒక్కరూ తమిళంతో పాటు, ఇంగ్లీషు నేర్చుకుంటారని దయానిధిమారన్ అన్నారు.