
రాజ్‌కోట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిరంజన్ షా స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కివీస్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 70 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ (24) వికెట్ తర్వాత కోహ్లీతో కలిసి గిల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు అర్థ శతకం సాధించాడు. కానీ 56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు.
స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా ఈసారి భారీ స్కోర్ సాధించలేకపోయాడు. 23 పరుగులకే తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. కానీ, కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ మాత్రం చెలరేగిపోయాడు. కివీస్ బౌలింగ్‌ని ధీటుగా ఎదురుకుంటూ.. పరుగులు సాధిస్తూ వచ్చాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా.. తాను మాత్రం నిబద్ధతతో బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శతకం సాధించాడు. 92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 112 పరుగులు చేశాడు. ఇక రవీంద్ర జడేజా (27), నితీశ్ కుమార్ (20) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కివీస్ బౌలింగ్‌లో క్రిస్టేన్ క్లార్క్ 3, జెమిసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్‌వెల్ తలో వికెట్ తీశారు.