
రాజ్‌కోట్: రెండో వన్డేలోనూ టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిరాశపర్చాడు. కేవలం 24 పరుగులు మాత్రమే చేసి పెవిలయన్ కు చేరాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిరంజన్ షా స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శుభారంభం లభించింది. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ వేగంగా బ్యాటింగ్ చేస్తుండటంతో జట్టు స్కోరు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో రోహిత్ భారీ షాట్ కు యత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కింగ్ కోహ్లీ తొలి బంతికే ఫోర్ కొట్టి న్యూజిలాండ్ బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. తొలి వన్డేలోనూ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. 93 పరుగులు చేసిన కోహ్లీ తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ప్రస్తుత కోహ్లీ, గిల్ లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గిల్ ఈ సిరీస్ లో రెండో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాగా, భారత్ 15 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 87 పరుగులు చేసింది. క్రీజులో గిల్(51), కోహ్లీ(8)లు ఉన్నారు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ధ్ కృష్ణ.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్), జాకరీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్.