Reading Time: 2 minutes

టెహ్రాన్: ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్యపై సంచలనాత్మక కథనాలు వెలువడుతున్నాయి. వాటిని బట్టి చూస్తే ఘోర నరమేధమే జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఆందోళనలు, ఘర్షణల్లో 600మంది మాత్రమే మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నా యి. తాజాగా మంగళవారం నాటికి మృతుల సంఖ్య 2000 అని హ క్కుల కార్యకర్తలు ప్రకటించారు. వీరిలో 137 మంది సైనికులు కూ డా ఉన్నట్లు తెలిపారు. అయితే మృతుల సంఖ్య వందలల్లో కాదని.. వేలల్లో ఉందని ఇరాన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ ప్రకటించగా.. ఇప్పటి వరకు 12వేల మంది ఘర్షణల్లో మృత్యువాతపడ్డారని ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ తన కథనంలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయని, దీన్ని తాము 

ఊరికే చెప్పడం లేదని, భద్రతా బలగాలు, ప్రత్యక్ష సాక్షులు, అధ్యక్ష కార్యాలయంతో పాటు వివిధ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకే వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ నెల 8,9 తేదీల్లో హింసాత్మక ఘటనలు అధికంగా జరిగాయని, వీటిల్లోనే అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయని ఆ కథనంలో తెలిపింది. అయితే ఈ మరణాల వెనక ఉగ్రవాదుల ప్రమేయం ఉందని ఇరాన్ అధికార వర్గాలు వెల్లడించడం విశేషం. ఆధునిక ఇరాన్‌లో ఇప్పటి వరకు ఇంతటి హింస జరగలేదని, ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు అవగతమవుతోందని అమెరికాకు చెందిన ఒక న్యూస్ ఏజెన్సీ అభిప్రాయపడింది. ఇదిలావుండగా కొన్ని వారాలుగా ఆప్తులతో కనీసం ఫోన్‌లు కూడా మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉన్న ఇరాన్ వాసులకు మంగళవారంనాడు కొంత ఊరట కలిగింది. పొరుగుదేశాల్లోని వారితో ఇంటర్నెట్ కాల్స్ మాట్లాడుకునేందుకు వెసులుబాటు లభించింది.

ప్రభుత్వ సంస్థలు స్వాధీనం చేసుకోండి: ట్రంప్

 ఇరాన్ తమతో కాళ్లబేరానికి వచ్చిందని, సంప్రదింపులకు ప్రతిపాదన చేసిందని ఇటీవల ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్‌లో ఆందోళనలకు మరింత ఆజ్యం పోసేలా తాజాగా సంచలన ప్రకటన చేశారు. నిరనసకారులు ఆందోళనలు కొనసాగించాలని, తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారంనాడు సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో ఒక పోస్టు పెట్టారు. ఇరాన్ అధికారులతో చర్చలు రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ‘ఇరానియన్ దేశభక్తులారా.. ఆందోళనలు కొనసాగించండి, మీ సంస్థలను చేతుల్లోకి తీసుకోండి. హంతకులు, మిమ్నల్ని తూలనాడే వారి పేర్లను మదిలో పెట్టుకోండి. వాళ్లు త్వరలో భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. ఇరాన్ అధికారులతో అన్ని రకాల సమావేశాలు రద్దు చేసుకున్నాను. మతిలేకుండా ఆందోళనకారులను పొట్టబెట్టుకుంటున్న సంఘటనలు ఆగిపోవాలి. మీకు అందించబోతున్న చేయూత దారిలో ఉంది’ అని ట్రూత్‌లో ట్రంప్ రాసుకొచ్చారు.