
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోలులో తెలంగాణ రికార్డు సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమా ర్‌రెడ్డి పేర్కొన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ముందెన్నడూ లేని రీతిలో 70.82 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి రికార్డు నెలకొల్పిందన్నారు. గతంలో కొనుగోలు చేసిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డ్‌ను ఈ ఖరీఫ్ సీజన్ అధిగమించిందని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దీనిని చారిత్రక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖలను సమన్వయం చేయడంతో పాటు తెలంగాణా రైతాంగం భాగస్వామ్యం కావడంతో ఈ రికార్డు సాధించగలిగామని మంత్రి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన ప్రకటన విడుదల చేశారు. ధాన్య సంపదకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినం జరుపుకుంటున్న తెలంగాణా రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పర్వదినాన్ని పురస్కరించుకుని రంగవల్లులు అద్దుతున్న మహిళా మణులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ధాన్యం దిగుబడిలో రైతుల కృషి అభినందనీయం
ధాన్యం దిగుబడిలో రైతుల కృషిని అభినందించిన ఆయన వ్యవసాయ రంగంపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలకు అద్దం పడుతుందని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం కాగా, 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని ఆయన వివరించారు. రాష్ట్రంలో సాధించిన దిగుబడికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 13.97 లక్షల మంది రైతులకు మద్దతు ధర అందించామని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం మొత్తానికి 16,912 కోట్లు పై చిలుకు కాగా ఇందులో ఇప్పటికి 16,602 కోట్లు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో సన్నాలను పండించేందుకు గాను ముందెన్నడూ లేని రీతిలో
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ ను సన్నాలు పండించిన రైతాంగాం ఖాతాలో జమ చేశామని ఇప్పటి వరకు 1,425 కోట్లు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయిన నేపద్యంలో కొనుగోలు ప్రక్రియ కుడా ప్రభుత్వం ఒక సవాల్ గా స్వీకరించి 8,448 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్లనే ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. ధాన్యం దిగుబడిలోనే కాదు, ధాన్యం కొనుగోలులోనూ తెలంగాణా రాష్ట్రం రికార్డు సృష్టించిందని అన్నారు. ఇందులో ప్రధాన భాగస్వామ్యం తెలంగాణా రైతాంగానిదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు.