Reading Time: < 1 minute

రాజ్‌కోట్: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగే రెండో వన్డేకు ఆతిథ్యటీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను పట్టేయాలనే ఉద్దేశంతో భారత్ బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో ఓడిన న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ పరీక్షగా మారింది. సిరీస్‌లో నిలువాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. వడోదరలో జరిగే మ్యాచ్‌లో కివీస్ గట్టిగానే పోరాడినా ఫలితంలేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్‌లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగడం ఖాయమనే చెప్పాలి.

జోరుమీదున్న విరాట్..

సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. కొంతకాలంగా కోహ్లి అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ నమ్మకాన్ని పెట్టుకుంది. కోహ్లి కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలనే లక్షంతో ఉన్నాడు. మరో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. తొలి మ్యాచ్‌లో కోహ్లి 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి మాత్రం మెరుగైన స్కోరును సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. తొలి వన్డేలో గిల్ అర్ధ సెంచరీ సాధించాడు. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా దూకుడు మీద ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

అయితే తొలి వన్డేలో జడేజా విఫలం కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. కానీ కెఎల్ రాహుల్ జోరుమీదుండడం ఊరట కలిగిస్తోంది. కిందటి మ్యాచ్‌లో రాహుల్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. ఈసారి కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. బౌలింగ్‌లోనూ భారత్ బలంగానే ఉంది. మరోవైపు కివీస్ కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. హెన్రీ నికోల్స్, కాన్వే, డారిల్ మిఛెల్ తొలి వన్డేలో అర్ధ సెంచరీలతో రాణించారు. విల్ యంగ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్ తదితరులతో కివీస్ బలోపేతంగా ఉంది. దీంతో భారత్‌కు ఈసారి కూడా గట్టి పోటీ తప్పక పోవచ్చు.