
మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా ఐఏఎస్ ఆఫీసర్‌ను కించపరిచేలా పలు మీడియాలో వచ్చిన కథనాలు, నారాయణపేట జిల్లా మద్దూరులో నమోదైన కేసుల్లో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశారు. మహిళా ఐఏఎస్ ను కించపరిచేలా వార్తా కథనాలు ప్రచారం చేశారని తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ కేసు నమోదు చేయగా, సిఎం రేవంత్ రెడ్డి ఫొటోను అసభ్యకరంగా పోస్టు చేశారని కావలి వెంకటేశ్ పై కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహా ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 11వ తేదీన కేసు నమోదయ్యింది. ఈ రెండు కేసులపై దర్యాప్తు చేపట్టేందుకు హైదరాబాద్ సిపి వి.సి సజ్జనార్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. నగరంలో పనిచేసే నార్త్ రేంజ్ జాయింట్ సిపి శ్వేత, చేవెళ్ల డిసిపి యోగేశ్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డిసిపి వెంకట లక్ష్మి, సైబర్ క్రైమ్ డిసిపి అరవింద బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్, సిసిఎస్ ఏసిపి గురు రాఘవేంద్ర, సైబర్ సెల్ సిఐ శంకర్ రెడ్డి, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్‌ఐ హరీశ్‌లు ఉన్నారు. ఈ రెండు కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, చార్జీషీట్లను దాఖలు చేయాలని సిట్ ను డిజిపి ఆదేశించారు.