Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం తరచూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. అధికార పక్షానికి సన్నిహితంగా ఉండే టివి ఛానల్ ఒక మంత్రిపై ప్రచురించిన వా ర్తా కథనాన్ని ఉటంకించినందుకు అనేక ఇతర ఛా నళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చే యడానికి రేవంత్ ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పా టు చేయడం విడ్డూరంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వార్తను ప్రచురించిన అసలు ఛానల్ మీద చర్యలు తీసుకోకుండా సిట్ పేరుతో ఈ కొత్త నాటకాలు ఎందుకని ప్రశ్నించారు. ఈ సిట్ ఎవరిని కాపాడటానికి, ఎవరిని వేటాడడానికి అంటూ ఆయన నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఓవరాక్షన్‌ను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. మీడియా సంస్థల మీద ఈ వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కేవలం ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే ఈ సిట్ గారడీలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దాచి ఉంచేందుకే ఇటువంటి డ్రామాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై దర్యాప్తు చేయాలి

నిజంగానే ప్రత్యేక దర్యాప్తు చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు అక్రమాలపై దర్యాప్తు చేయాలని కెటిఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారులో జరుగుతున్న అనేక దారుణాలపై ఎందుకు సిట్ వేయడం లేదని నిలదీశారు. సాక్షాత్తూ ఒక మంత్రి పి.ఎ, రేవంత్ రెడ్డి సహచరుడు కలిసి ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి రూ. 300 కోట్లు డిమాండ్ చేస్తే దానిపై విచారణ చేయడానికి సిట్ ఉండదని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో మంత్రి పి.ఎనే ఇసుక దందాలో కోట్లు దండుకుంటున్నా సదరు ఇసుకాసురుల మీద కేసులు లేవని, అలాగే రాష్ట్ర రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గూండాలను వెంటబెట్టుకుని హైదరాబాద్ శివార్లలో వందల కోట్ల భూకబ్జాకు పాల్పడితే, ఉల్టా ఆ కేసు నమోదు చేసిన పోలీస్ అధికారిని బదిలీ చేస్తారు.. కానీ, ఆ కబ్జాల విచారణకు మాత్రం సిట్ ఉండదని ధ్వజమెత్తారు.

ఎఐసిసి సెక్రటరీ, రేవంత్ సన్నిహితుడు సంపత్ కుమార్ ఒక నేషనల్ హైవే కాంట్రాక్టర్‌ను మారణాయుధాలతో బెదిరించి రూ.8 కోట్లు డిమాండ్ చేసినా ఎటువంటి చర్యలు లేవని కెటిఆర్ విమర్శించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో బంకర్ బెడ్స్ కొనుగోలులో జరిగిన రూ. 100 కోట్ల కుంభకోణంపై గానీ, వందల కోట్ల లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ల వివాదంలో ఒక ఐఎఎస్ అధికారిని బలిచేసిన ఉదంతంపై గానీ ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు. కాసుల కక్కుర్తి కోసం నిబంధనలకు విరుద్ధంగా చీప్ లిక్కర్ కంపెనీలకు అనుమతులిచ్చి వందల కోట్లు కొల్లగొట్టిన స్కామ్ మీద, అలాగే 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకంలో పెద్ద ఫ్రాడ్ జరిగిందని సుప్రీంకోర్టు కమిటీ తేల్చినా ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. విచారణల పేరిట కమిషన్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ల ఏర్పాటు కేవలం కాలయాపనకేనని కెటిఆర్ ఆరోపించారు.