Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కా ర్పోరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో 25,62,369 మంది పురుష ఓటర్లు కాగా.. 26,80,014 మంది మహిళా ఓట ర్లు, 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉండగా.. కొత్తగూడెం కార్పొరేషన్ లో అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు ఉన్నా రు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉండగా.. అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓట ర్లు ఉన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో పండగ వేళ ఎన్నికల సందడి మొదలు కానుంది. మున్సిపల్ తుది ఓటర్ల జాబితా విడుదల కావడంతో త్వ రలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలో 8,195 పోలింగ్ స్టేషన్లను ఎస్‌ఇసి ఖరారు చేసింది. మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లపై ఖరారుపై పురపాలకశాఖ కసరత్తు ముమ్మరం చేస్తోంది. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణలో రిజర్వేషన్ల ప్రక్రియ అత్యంత కీలకం కావడంతో అధికారులు దీనిని సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ నెల 20 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు, డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా బిసి రిజర్వేషన్లను ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశముంది.