Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ , జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడిరిక్ మెర్జ్ మధ్య కీలక సమావేశం సోమవారం జరుగుతుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఇరువురు నేతల భేటీకి అంతర్జాతీయ స్థాయి ప్రాధాన్యత ఏర్పడింది. జర్మనీ అధినేత సోమవారం, మంగళవారం భారతదేశంలో పర్యటిస్తారు. జర్మనీ ఛాన్సలర్ హోదాలో ఆయన ఆసియా దేశాలలో పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ముందుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మోడీతో చర్చలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత జర్మనీ నేత బెంగళూరుకు వెళ్లుతారు.

వెనెజువెలా అధ్యక్షులు మదురోనే భార్యతో పాటు అమెరికా సేనలు బందీగా అమెరికాకు తరలించడం, భారీ స్థాయిలో ట్రంప్ సుంకాలు, రష్యా చమురు నౌకలపై యుఎస్ నావిక దళ దాడులు, వాటి స్వాధీనం, ఇరాన్‌లో తీవ్రస్థాయి ఉద్రిక్తత ఇతర పరిణామాల దశలో భారత్ జర్మనీ నేతల చర్చల్లో అనేక కీలక విషయాలు ప్రస్తావనకు వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి . ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన దిశలో కూడా ఇరువురు నేతలు మాట్లాడుకుంటారు. అహ్మదాబాద్‌లో ప్రధాని మోడీతో చర్చలు, అక్కడి సబర్మతి ఆశ్రమానికి సందర్శనకు వెళ్లడం, గాలిపటాల ఉత్సవంలో పాల్గొనడం , నైపుణ్యాభివృద్ధి సదస్సుకు హాజరుకావడం జర్మనీ నేత షెడ్యూల్‌లో ఉంది. శక్తివంతమైన యూరప్ దేశాలలో జర్మనీ కూడా ఒకటిగా ఉంది. భారతదేశపు కీలక ఇయూ వ్యాపార భాగస్వామ్య పక్షంగా కూడా ఉంది.