Reading Time: 2 minutes
Revanth Reddy Musi River Temple Redevelopment Machileshwar Omkareshwar Project

CM Revanth Reddy: మంచిరేవులలో మూసీనదీ తీరాన మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయాల సముదాయం పునర్నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. చరిత్రలో ఎవరికో ఎప్పుడో ఇలా ఒక అవకాశం వస్తుందని తెలిపారు. తనకు అవకాశం దక్కిందన్నారు. ఇది శివేచ్చ అని.. ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. ఇది కనుమరుగు కావద్దని.. భవిష్యత్ తరాలకు అందించాలని తమ ఉద్దేశమన్నారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ కుదరదలేదని గుర్తు చేశారు. కానీ ఆ అదృష్టం తమకే దక్కిందన్నారు. ఎన్ని విమర్శలు.. అడ్డంకులు వచ్చినా ఆలయ నిర్మాణం చేసి తీరుతామని స్పష్టం చేశారు. చరిత్రలో నది పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత పుట్టిందని.. అభివృద్ధి కూడా నది పరివాహక ప్రాంతాల్లోనే జరిగిందని తెలిపారు. ఆర్థిక అభివృద్ధి కూడా అక్కడే పుట్టిందన్నారు. పారిశ్రామిక వేత్తలకే కాదు, పేదలు, సామాన్యులకు కూడా ఆర్ధిక అభివృద్ధికి నిలయమన్నారు.

READ MORE: Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

మూసి ప్రక్షాళన ఈశ్వరుడి ఆశీస్సులుతో మొదలు పెడుతున్నామని.. మూసి ప్రాంతంలో అద్భుత మసీదు కూడా నిర్మిద్దామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సిక్కుల కోసం స్వర్ణ దేవాలయం లాంటి మందిరం నిర్మిస్తామని.. ఉప్పల్, నాగోల్ ప్రాంతంలో అద్భుత చర్చి కడతామన్నారు. గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలిస్తున్నామని తెలిపారు. మూసీలో నీరు ప్రవహించేలా చేస్తామన్నారు. నిత్యవసరం కంటే ఇది అత్యవసరమని చెప్పారు. భువనగిరి, ఆలేరు ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్నారు. ఆ ప్రాంతాల్లో పంట కూడా కొనే పరిస్థితి లేదు. పిల్లలకు జబ్బులు వస్తున్నాయన్నారు. యువ దంపతులు కూడా పుట్టిన ఊర్లో లేకుండా పట్నం వైపు వలస వస్తున్నారు. ఫ్లోరైడ్ వెంటాడుతుంది వాళ్ళను. ఫ్లోరైడ్ ప్రకృతి వైపరీత్యం. మూసి మానవ తప్పిదమని చెప్పారు. అందుకే ప్రక్షాళన చేయాల్సిందే. ఖర్చు అయినా చేయాలని నిర్ణయించామన్నారు. కొద్ది మంది స్వార్థ ప్రయోజనం కోసం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. “ఓ అక్క కొడుకుతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించింది. అక్కకు ఈ ప్రాంత ప్రజలు ఓటేయలేదా..? అక్కకు ఎందుకు ఇలాంటి పని చేయొద్దని అనుకుంది. ప్రజా ప్రతినిధిగా నువ్వు కొనసాగే హక్కు ఉందా..? ఒకప్పుడు సరిగా ఉండేది.. ఇప్పుడు ఇలా ఎందుకు తయారు అయ్యారో తెలియదు. నీ పుత్రరత్నం వేసిన కేసు వెనక్కి తీసుకోమని చెప్పండి. లేదంటే మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తది. వెనకాల ముసుగు వేసుకుని చిల్లర మల్ల వేషాలు వేసే వాళ్ళు మానుకోండి. అక్కడి సూర్యుడు.. ఇక్కడ మొలిచినా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం. ఇది మా శివ దీక్ష.. రామప్ప ఆలయం కూడా అభివృద్ధి చేస్తాం. దక్షిణ కాశిగా రాణించేలా అభివృద్ధి చేస్తాం.” అని సీఎం వ్యా్ఖ్యానించారు.