
Aloo Roti Recipe: ప్రతిరోజూ ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్ అల్పాహారం తింటూ విసిగిపోయారా? అయితే ఈ రోజు మీరు తప్పకుండా ప్రయత్నించాల్సిన ప్రత్యేక వంటకం ఆలూ రోటీ. బంగాళదుంపలతో తయారు చేసే ఈ రోటీ రుచిగా ఉండటమే కాకుండా తేలికగా, త్వరగా తయారవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ వంటకం మీ ఇంట్లో ఫేవరెట్‌గా మారిపోతుంది. అయితే, చాలామంది బంగాళదుంపతో పరాటా, పూరీ వంటి వంటకాలు తిని ఉంటారు. కానీ ఆలూ రోటీ మాత్రం కొంచెం కొత్తగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఉదయం తొందరగా ఉన్నప్పటికీ సులభంగా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా, లంచ్‌బాక్స్‌కు లేదా సాయంత్రం స్నాక్‌గా కూడా ఇది బాగా సరిపోతుంది. నలుగురు సభ్యులున్న ఓ కుటుంబాన్ని ప్రతిపాదికగా తీసుకుంటే..
కావలసిన పదార్థాలు
* 7 ఉడికించిన బంగాళదుంపలు
* 1 కప్పు మైదా పిండి
* 2 టేబుల్ స్పూన్ల నూనె
* 2 టీస్పూన్ల ధనియాల పొడి
* 1 టీస్పూన్ కారం పొడి
* 1 టీస్పూన్ జీలకర్ర
* 1 టీస్పూన్ గరం మసాలా
* 1 టీస్పూన్ ఆమ్చూర్ పొడి
* రుచికి సరిపడా ఉప్పు
* అవసరమైనంత నెయ్యి
తయారీ విధానం
మొదటగా ఉడికించిన బంగాళదుంపలను బాగా మెత్తగా మాష్ చేయాలి.. ఒక బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి. తరువాత మాష్ చేసిన బంగాళదుంపలు, కారం, ధనియాల పొడి, ఉప్పు, ఆమ్చూర్ పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు వేయించి లేత ఎరుపు రంగు వచ్చే వరకు ఉంచాలి. ఇక పిండిని సిద్ధం చేయడానికి మైదాలో కొద్దిగా ఉప్పు వేసి నీరు జోడించి మృదువుగా కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని అందులో బంగాళదుంపల మిశ్రమాన్ని పెట్టి పల్చగా రోటీలుగా ఒత్తాలి. కూర ఎక్కువగా పెట్టకుండా జాగ్రత్త పడాలి. తర్వాత తవ్వపై నెయ్యి రాసి రోటీలను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే, రుచికరమైన ఆలూ రోటీ సిద్ధం.. వేడివేడిగా పెరుగు, చట్నీ లేదా సాస్‌తో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేస్తే, మీ ఇంట్లో అందరూ మళ్లీ మళ్లీ అడుగుతారు సందేహమే లేదు..