
మూసీ ప్రక్షాళన అత్యవసరమని ముఖ్యమంత్రి రేవ్ంత్ రెడ్డి అన్నారు. మంచిరేవులలో పర్యటన సందర్భంగా శనివారం సిఎం రేవంత్‌రెడ్డి.. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని.. ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించడం భగవత్ కార్యంగా భావిస్తున్నామని అన్నారు. మంచిరేవులలో ఈ కార్యక్రమం దేవుడి నిర్ణయమని చెప్పారు.
“హైదరాబాద్ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలిసి.. నల్గొండ వరకూ వెళ్తోంది. మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలు చాలా బాధపడుతున్నారు. పుట్టిన ఊరి నుంచి పిల్లలను బయటకు పంపే దుస్థితి ఈ ప్రాంతంలో ఉంది. గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలిస్తున్నాం. మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం. మూసీ నదిని బాగుచేయాలని గతంలో అనేకమంది ప్రయత్నించారు. ఈ అవకాశం మా ప్రభుత్వానికి దక్కడం మా అదృష్టం” అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణంతోపాటు ఆధునిక గోశాల నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రూ.700 కోట్ల వ్యయంతో 8 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించనున్నారు. వంద అడుగులతో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.