
ఆధునిక ప్రపంచ వాణిజ్యంలో 80% నుండి 90% వరకు నిత్యావసర సరకులు సముద్రమార్గం ద్వారానే రవాణా అవుతుంటాయి. ఇంధనం, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆహార పదార్థాలు, కాఫీగింజలు ఇవన్నీ ఒక దేశం నుంచి మరో దేశానికి నౌకల ద్వారానే రవాణా అవుతుంటాయి. రోడ్లు, విమానాలద్వారా కన్నా నౌకలద్వారా రవాణాకు తక్కువ ఖర్చు అవుతుంది. ప్రపంచ జిడిపిలో సముద్ర వాణిజ్యం సుమారు 60% వాటాను కలిగి ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సముద్ర రవాణా వెన్నెముక వంటిది. హోర్ముజ్, ఎర్రసముద్రం, సూయెజ్ కాలువల ద్వారా జరిగే సముద్ర వాణిజ్య నౌకల రవాణాలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా అది ప్రపంచం మొత్తంమీద వాణిజ్యంపై విపరీత ప్రభావం చూపిస్తుంది. కొన్ని నౌకలపై దాడులు జరిగినా మొత్తం సముద్ర రవాణా మార్గాల మూసివేతకు దారి తీస్తుంది. ఇప్పుడు హోర్ముజ్ జలసంధిద్వారా జరిగే వాణిజ్య నౌకల రవాణా ఎలాంటి సంక్షోభంలో అల్లాడుతోందో మనం చూస్తున్నాం.
ఇరాన్, ఉక్రెయిన్, అమెరికా దేశాలు వాణిజ్య నౌకలను టార్గెట్ చేసుకుని దాడులు సాగిస్తుండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమైన పరిణామంగా మారుతోంది. ఇరాన్ యుద్ధం మొదటి రెండు వారాల్లోనే ఆయిల్ టాంకర్లతోసహా మొత్తం 16 సరకుల రవాణా నౌకలు దాడికి గురయ్యాయి. ఇవి కాక వందలాది నౌకలు గల్ఫ్ జలసంధిలో చిక్కుకున్నాయి. దీంతో చమురు, గ్యాస్, ఎరువులు, అల్యూమినియం, సల్ఫర్, హీలియం తదితర అనేక సరకులు కరువైపోతున్నాయి. ఇరాన్ తన వ్యూహం మార్చుకుని భూతల, గగన దాడుల కన్నా సముద్ర వాణిజ్య నౌకలపైనే దాడులు సాగిస్తూ సముద్ర వాణిజ్యాన్ని మొత్తం తన గుప్పిటలో బందీగా చేసుకుంటోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యా వాణిజ్య నౌకలపై దాడులు ప్రారంభించింది. రష్యా చమురు ఎగుమతి యంత్రాంగంలో 40 శాతాన్ని స్తంభింపచేసింది. రేవులపైన, పైపులైన్లపైనా ఉక్రెయిన్ దాడులు కొనసాగిస్తుండడంతో రష్యా నుంచి చమురు సరఫరా దెబ్బతింటోంది. రోజువారీ సరఫరాలో 2 మిలియన్ బ్యారెళ్ల వరకు తగ్గిపోతోంది.
ఇది భారత్ రోజువారీ వినియోగంలో మూడో వంతు కన్నా ఎక్కువ. దీనికి తోడు రష్యా రహస్య నౌకాదళం ట్యాంకర్లను ఐరోపా ముట్టడించడంతో సరఫరా మరింత దెబ్బతింది. ప్రపంచ వాణిజ్యంపై ఈ ప్రభావం ఎంతో ఇప్పుడు చెప్పడం కష్టం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సైనిక కార్యకలాపాలతో సంబంధం లేని వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడులు చేయకూడదు. ఈ వాణిజ్య నౌకలు సైనిక కార్యకలాపాలకు సహాయం చేసినా, ఆయుధాలను రవాణా చేసినా లేదా శత్రువుకు మద్దతుగా పనిచేసినా అప్పుడు వాటిని సైనిక లక్షాలుగా భావించి దాడిచేసే అవకాశం ఉంటుంది. సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలు సాధారణ పౌర ఆస్తులుగా పరిగణించబడతాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్, సముద్ర చట్టాల కన్వెన్షన్ ప్రకారం సాధారణ పరిస్థితుల్లో వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడం ముఖ్యమైన కర్తవ్యం. పశ్చిమాసియా యుద్ధం బీభత్సంగా మారడంతో తన వాణిజ్య నౌకల రక్షణ కోసం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం భారత్ నౌకాదళం యుద్ధ నౌకలను మోహరింప చేసిన సంగతి తెలిసిందే.
అందువల్ల సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించని వాణిజ్య నౌకలపై దాడులు చేయడం యుద్ధ నియమాల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇప్పుడు హోర్ముజ్ జలసంధి సంక్షోభం మాదిరిగానే రెండేళ్ల క్రితం ఎర్రసముద్ర రవాణా మార్గం లోనూ సంఘర్షణ జరిగింది. రష్యా నుంచి చమురు తీసుకుని వస్తున్న బ్రిటన్‌కు చెందిన మార్టిన్ లువాండా అనే నౌకపై ఎర్రసముద్ర మార్గంలో హోతీలు దాడులు చేయడంతో మంటలు చెలరేగి పెను ప్రమాదం సంభవించింది. దాంతో భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్ విశాఖ యుద్ధ నౌక అప్రమత్తమై ఆ నౌకను మంటల నుంచి రక్షించింది. దీంతో రవాణా సంస్థలన్నీ తమ సముద్ర మార్గాలను మార్చుకోవలసి వచ్చింది. ఇది జరిగి రెండేళ్లయినా ఎర్రసముద్ర రవాణా మార్గం ఇంకా సాధారణ స్థితికి రాకపోవడం గమనార్హం. యుద్ధంలో వాణిజ్య నౌకలపై దాడులు చేయడం వల్ల వచ్చే అనర్థాలను మనం మరిచిపోయినట్టుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ 2426, అమెరికా 1768 వాణిజ్య నౌకలను కోల్పోయాయి. ప్రపంచంలోనే మూడో అతిభారీ ప్యాసింజర్, కార్గో నౌకలను సమకూర్చుకున్న జపాన్ ఈ రెండో ప్రపంచ యుద్ధంలో 2346 వాణిజ్య నౌకలను కోల్పోయింది.
ఈ యుద్ధం పూర్తయ్యేసరికి కనీసం 1000 టన్నులకు మించి సామర్థం కలిగిన ఒక్క నౌకను కూడా దక్కించుకోలేకపోయింది. ఆ రోజుల్లో యుద్ధాలన్నీ కేవలం మిలిటరీ సామర్ధాల బట్టే జరిగేవి. భారీ నౌకలను మిలిటరీయే ధ్వంసం చేసేది. కానీ ఇప్పుడు అలా కాదు, సాంకేతికంగా ఎన్నో వ్యూహాలు రూపొందుతున్నాయి. ఒక్క బటన్ నొక్కితే టార్గెట్ ప్రకారం అంతా ధ్వంసమైపోతోంది. ఇరాన్, ఉక్రెయిన్, హోతీ దళాలు ఇప్పుడు యుద్ధంలో విధ్వంసానికి భారీ క్షిపణులను వినియోగించడం లేదు. కేవలం కొన్ని వేల డాలర్ల ఖర్చుతో తయారయ్యే అత్యల్ప డ్రోన్లతోనే లక్షాలను సాధించుకుంటున్నాయి. ప్రభుత్వాల మద్దతుతో దుండగులు సృష్టించగల విధ్వంసం ఎలా ఉంటుందో స్పష్టంగా కనిపిస్తోంది. భూతల, గగనమార్గాలు కాకుండా సముద్ర మార్గాలే రణరంగాలుగా మారుతున్నాయి. ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నాయి. అందువల్ల సముద్రమార్గాలను సురక్షితంగా అందరికీ అందుబాటులో ఉంచేలా కొత్తగా దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని పెంపొందించడానికి తగిన చర్యలు చేపట్టే అవసరం ఏర్పడింది. ఈ విషయంలో అమెరికాయే చొరవ తీసుకుంటుందన్న అభిప్రాయం వినిపించినా నమ్మకం కుదరడం లేదు.