Reading Time: 2 minutes

న్యూఢిల్లీ: ప్రస్తుత ఎడతెగని పశ్చిమాసియా యుద్ధం, సంబంధిత సంక్షోభం దశలో భారతదేశం టీమిండియాగా వ్యవహరిస్తుందని , అ త్యంత ప్రాధాన్యత క్రమంలో ముందుగా సరఫరాల గొలుసుకట్టు వ్యవస్థల సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సంక్షోభ దశలో పరిస్థితి సమీక్షకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నతస్థాయిలో కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర మంత్రిమండలిలోని కీలక మంత్రిత్వశాఖల మంత్రులు , కేబినెట్ సెక్రెటరీలు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.

ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత వహిస్తూ ఖరారు చేసుకున్న ప్రాధాన్యతాక్రమాలను ముఖ్యమంత్రులకు వివరించారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత నిర్వహణ కుంటుపడరాదు..ఇంధన భద్రతకు తిరుగులేకుండా చేయాలి. దేశ పౌరుల ప్రయోజనాలను పరిరక్షించాలి. అన్నింటికి మించి నిత్యావసరాలు, చమురు ఇంధన సరఫరా వ్యవస్థలను పటిష్టపర్చుకోవాలి. పారిశ్రామిక వ్యవస్థకు ప్రతికూలత ఏర్పడరాదనేవి కలిసికట్టు బృందంగా ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలు కావల్సి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చత ఎటు నుంచి ఎటు దారితీస్తుందో తెలియని స్థితికి తీసుకువెళ్లుతోంది. ఈ దశలో మనమంతా మరింత జాగరూకత, అంతకుమించిన సమన్వయంతో , సవాళ్లపై తక్షణ స్పందనతో ముందుకు వెళ్లాల్సి ఉందని పిలుపు నిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహాయించి ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని అధ్యక్షతన జరిగిన భేటీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠత , ఆసక్తి నెలకొంది. కఠిన నిర్ణయాలు ఉంటాయనే ఊహాగానాలు వెలువడ్డాయి. లాక్‌డౌన్ వార్తలను కేంద్రం ఖండించింది.

టీం ఇండియా స్ఫూర్తితో ఏదైనా ఎదుర్కొవచ్చు ః ప్రధాని పిలుపు

సంక్షోభ సమయంలో మనం కలిసికట్టుగా పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుంటుందని ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ తెలిపారు. టీం ఇండియా స్ఫూర్తి ఇంతకు ముందు కోవిడ్ దశలో ప్రదర్శించామని, ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం నుంచి తలెత్తిన సవాళ్ల దశలో కూడా ఇదే విధానం అవలంభించాలని కోరారు. ఈ విధంగా మనం విజయం సాధించగలమనే నమ్మకం తనకు ఉందన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంది. పరిణామాలు గణనీయంగా ఉంటున్నాయి. నిరంతర పర్యవేక్షణ అవసరం అన్నారు. ఈ దిశలో తమ ప్రభుత్వం ఇప్పుడు అంతర్గత మంత్రుల బృందం ఏర్పాటు చేసిందని వివరించారు. పరిస్థితిని ఈ నెల 3వ తేదీ నుంచి సమీక్షిస్తున్నారని, చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు.

బ్లాక్‌మార్కెటీర్లపై ఉక్కుపాదం తప్పనిసరి

ఇప్పుడు నిత్యావసర సరుకుల సరఫరా అత్యంత కీలక విషయం అని ప్రధాని మోడీ చెప్పారు. ఈ క్రమంలో సరఫరాల వ్యవస్థ క్రమపద్థతిలో ఉండాలి. నిర్వహణ గతి తప్పరాదని హితవు పలికారు. ప్రత్యేకించి బ్లాక్ మార్కెట్, సరుకుల నిల్వలకు దిగే వారిపై రాష్ట్రాలలో పూర్తి స్థాయి కఠిన చర్యలు అవసరం అని ప్రధాని తెలిపారు. రాష్ట్రాల ప్రధాన కేంద్రాలలోనే కాకుండా, జిల్లా పంచాయతీ స్థాయిల్లో కూడా అధికార నిర్వహణ యంత్రాంగం సరిగ్గా పనిచేయాల్సి ఉంటుందని, పనిచేసేలా చేసే బాధ్యత రాష్ట్రాలపై ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ తమ సమీక్షలో వ్యవసాయ రంగంలో ముందస్తు ఏర్పాట్లు అవసరం అని , ఎప్పటికప్పుడు ఎరువుల కొరత , విత్తనాల పంపిణీలపై చర్యలు అవసరం అని ప్రధాని సూచించారు. ఖరీఫ్ పంటకాలం ముందున్నందున రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని ,

సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికననే మేల్కొల్పాపాల్సి ఉంటుందని ప్రధాని ముఖ్యమంత్రులకు తెలిపారు. వదంతులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ మోసాలు, మోసాల రాయుళ్ల పనిపట్టేందుకు క్షేత్రస్థాయిలో నిఘా పెంచాల్సి ఉందని సిఎంలకు తెలిపాఈ రు. సరిహద్దులు, తీర ప్రాంతాల రాష్ట్రాలకు ప్రత్యేకమైన రీతిలో జాగ్రత్త చర్యలు అవసరం అని ప్రధాని సూచించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు తమతమ శాఖలకు సంబంధించి ఇప్పటి సవాలును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశంలో పలు ప్రాంతాలలో వంటగ్యాసు, పెట్రోలు డీజిల్ కొరత రాకుండా చేయడంలో కేంద్రం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ఇప్పుడు ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపును అభినందించారని అధికారులు వెల్లడించారు.

పశ్చిమాసియా సంక్షోభ తీవ్రత దశలో కేంద్ర ప్రభుత్వం అనధికారిక అంతర్గత మంత్రుల బృందం (ఐగామ్) ఏర్పాటు చేసింది. దీనికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వం వహిస్తారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీ సభ్యులుగా ఉంటూ సహకరిస్తారు. గల్ఫ్ సంక్షోభంపై బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. తీసుకోవల్సిన చర్యలను నివేదిస్తుంది. ఇప్పటి యుద్ధం చమురు సంక్షోభాన్ని తద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం ఆగిపోయే సూచనలు కూడా వెలువడటం లేదు. నాలుగు వారాలు దాటిన ఈ యుద్ద ప్రభావంపై ఈ మంత్రుల బృందం స్పందించాల్సి ఉంటుంది.