
వారం రోజులుగా వేసవి తాపంతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరట్వాడ నుంచి కర్ణాటక తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమయిన ఈదురు గాలులు
వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో శనివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.