
ర్యాపర్‌గా పేరు పొందిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన బలేంద్ర షా ‘బలేన్’ నేపాల్ 47వ ప్రజాస్వామ్య ప్రధానిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని కుదిపేసిన జెన్-జెడ్ ఉద్యమం తర్వాత కె.పీ. శర్మ ఓలి ప్రభుత్వం కూలిన దాదాపు ఆరు నెలల తరువాత ఆయన పదవిలోకి వచ్చారు. 35 ఏళ్ల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) నేత అయిన బలేన్‌కు అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, శీతల్ నివాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలా 34 నిముషాలకు ప్రమాణం చేయించారు. కాఠ్మండు మాజీ మేయర్ అయిన బలేన్, నేపాల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధానిగా నిలిచారు. మధేశ్ ప్రాంతం నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి కూడా ఆయనే.ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిందూ, బౌద్ధ సంప్రదాయాల సమ్మేళనం కనిపించింది. ఏడు మంది బ్రాహ్మణులు శంఖనాదం చేయడం, 108 మంది హిందూ బటుకులు స్వస్తి వచనాలు చదవడం,
107 మంది లామాలు బౌద్ధ మంగళ వచనాలు పఠించడం వంటి విశేషాలు చోటుచేసుకున్నాయి.ఇదే రోజు రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం అధ్యక్షుడు బలేన్‌ను అధికారికంగా ప్రధానిగా నియమించారు. బలేన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్-నేపాల్ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ‘రోటి- బేటీ’ బంధం ఉన్నదని ఆయన గుర్తుచేశారు. నేపాల్ సముద్రతీరంలేని దేశం కావడంతో రవాణా, వాణిజ్య అవసరాల కోసం భారత్‌పై అధికంగా ఆధారపడుతోంది. దేశానికి సముద్ర మార్గం కూడా భారత్ ద్వారానే అందుతోంది.గత ఏడాది సెప్టెంబర్‌లో అవినీతి, బంధుప్రీతి, సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన జెన్- జెడ్ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఓలి ప్రభుత్వం పడిపోయింది.
అనంతరం మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలన్న ఆహ్వానాన్ని బలేన్ తిరస్కరించి, పూర్తి కాలం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. మార్చి 5న జరిగిన ఎన్నికల్లో జ్హాపా-5 నియోజకవర్గంలో నాలుగు సార్లు ప్రధానిగా ఉన్న ఓలిని భారీ మెజారిటీతో ఓడించారు. మొత్తం 275 స్థానాల్లో 182 సీట్లు గెలుచుకున్న ఆర్‌ఎస్‌పీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.బలేన్‌తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. స్వర్ణిమ్ వాగ్లే ఆర్థిక మంత్రిగా, శిశిర్ ఖనాల్ విదేశాంగ మంత్రిగా, సుదన్ గురుంగ్ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బలేన్ రక్షణ, పరిశ్రమ-వాణిజ్య శాఖలను కూడా తన వద్ద ఉంచుకున్నారు. ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా నియామకాలు చేపట్టారు.