Reading Time: 2 minutes
Ap Heatwave Alert March 28 Districts Temperature Warning

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు అప్పుడే నిప్పులు చెరుగుతున్నాయి. మార్చి నెల ముగియకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రేపు (శనివారం, మార్చి 28) ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, రాజాం, తెర్లాం వంటి పలు మండలాలు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, సాలూరు వంటి ప్రాంతాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 68 మండలాల్లో సాధారణ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. గుంటూరులో 16, పల్నాడులో 21, ఎన్టీఆర్ జిల్లాలో 9 మండలాలతో పాటు కృష్ణా, ఏలూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం నాటికి ఈ తీవ్రత మరింత పెరిగి, దాదాపు 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

Allu Arjun: సరిహద్దులు దాటిన ‘రామ’ నామం.. జపాన్ దిగ్గజానికి అల్లు అర్జున్ అరుదైన కానుక!

శుక్రవారం నమోదైన గణాంకాలను పరిశీలిస్తే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో గరిష్టంగా 42.1°C, కడప జిల్లా కమలాపురంలో 42°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పల్నాడు, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా పారలు 41 డిగ్రీలను దాటేశాయి. తీర ప్రాంత జిల్లాలైన కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరిలో కూడా 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవ్వడం గమనార్హం. ఈ అసాధారణ ఉష్ణోగ్రతల వల్ల జనజీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలు ఎండదెబ్బ నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గొడుగు, టోపీ లేదా తలకి టవల్ చుట్టుకోవాలని, శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాటన్ దుస్తులు ధరించాలని కోరారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ఎండ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, వేడి గాలి నేరుగా చెవుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని హితవు పలికారు. తగినంత నీరు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.