
అమరావతి: వైసిపి సభ్యుల చిత్తశుద్ధి ఏంటో వారి వైఖరితోనే తెలుస్తోందని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. అమరావతి తీర్మానం కోసం సమావేశం పెడితే వైసిపి సభ్యులు హాజరు కాలేదని అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అమరావతి తీర్మానంపై లోకేష్ మాట్లాడారు. ఉదయం 11 గం.కు ముహూర్తం చూసి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాం అని తెలియజేశారు. పాదయాత్రతో సిఎం చంద్రబాబు నాయుడుకు సినిమా చూపిస్తా అని మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి అంటున్నారని తెలియజేశారు. ప్రజలు జగన్ కు చూపించిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమోనని, జగన్ చూపిస్తానంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదు అని విమర్శించారు. అమరావతి తీర్మానాన్ని రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తున్నారని, మరోసారి తుగ్లక్ చర్యలు చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానాన్ని ఏప్రిల్ 2న పార్లమెంట్ లో పెట్టే అవకాశం ఉందని, అమరావతి చట్టబద్ధతపై పార్లమెంట్ లో నైనా వైసిపి తన వైఖరి చెబుతుందో లేదో?: అని సందేహాన్ని వ్యక్తం చేశారు. ఆత్మలతో మాట్లాడే అలవాటు జగన్ కు ఇంకా పోలేదని, జగన్ తో ఏ రోజు ఏ ఆత్మ మాట్లాడిస్తుందోనని వైసిపి నేతలు ఆందోళనలో ఉన్నారని లోకేష్ పేర్కొన్నారు.