Reading Time: < 1 minute

ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శ్రీరామనవమి వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పెదపేట లోని పురాతన రామాలయ దర్శనానికి వెళ్లిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాన్వాయ్‌పై జరిగిన దాడి రాజకీయంగా సంచలనం రేపింది. మేకుల కర్రలు, చాకులతో జరిగిన ఈ భయానక దాడిలో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంతో ఆకివీడు ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిపై రఘురామ స్పందిస్తూ తనపై జరిగిన దాడి కేవలం ఆకస్మికం కాదని, అది ముందస్తుగా ప్లాన్ చేసిన హత్యాయత్నం అని ఆరోపించారు. నిన్న సాయంత్రమే బయటి ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు ఆకివీడుకు చేరుకున్నారని, రాళ్లు, కత్తులు, మేకులతో తనపై దాడి చేసేందు కు వాళ్లు వచ్చారని ఆయన పేర్కొన్నారు.

వందేళ్ల చరిత్ర ఉన్న ఈ రామాలయాన్ని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, వారు హిందువులే అయి నప్పటికీ వేరే మతం ముసుగులో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాన్ని శుభ్రం చేయడానికి కూడా వారు అభ్యంతరం చెబుతున్నా రని తెలిపారు. దాడి చేసిన వారు రామ భక్తుల వేషంలో ఉండి ఒక్కసారిగా విరుచుకుపడ్డారని, తృటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించు కున్నానని వెల్లడించారు. లేనిపక్షంలో పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ఇలాంటి వికృత చేష్టలను ఆదిలోనే అరికట్టకపోతే అవి సమాజానికి పెద్ద ముప్పుగా మారతాయని రఘురామ హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించానని, వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు.