Reading Time: 2 minutes

 తెలంగాణ రాజకీయ యువనికపై మరోకొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు ఆశించిన రీతిలో సాకారం కాలేదని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాము కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు మేడ్చల్ నియోజక వర్గంలోని మునీరాబాద్‌లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్‌లో పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నేను నిజామాబాద్ కోడలిని.. ఇక్కడ పుట్టిన ఏ ఆలోచనైనా విజయవంతం అవుతుంది” అని కవిత ధీమా వ్యక్తం చేశారు. రాముడు తన ప్రజలను గుండెకు హత్తుకుని పాలించినట్లుగా,

తాము కూడా అన్ని వర్గాల వెలుగుల కోసం పని చేస్తామన్నారు. శ్రీరామ నవమి పర్వదినం రోజున పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందని, అంతకంటే ముందే కాశీకి వెళ్లి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసి వస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం బలమైన ప్రాంతీయ పార్టీ లేని లోటు కనిపిస్తోందని, తమ పార్టీ ప్రతి ఇంటి పార్టీగా మారుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను పక్కనపెట్టి రీల్స్ చూస్తున్నారని కవిత విమర్శించారు. ప్రశంసిస్తే పనులు జరగవు. ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి. అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడాన్ని ఆమెతప్పు బట్టారు. తెలంగాణ జాగృతి ద్వారా తాము చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ, ఖమ్మం వెలుగు మట్లలో నిర్వాసితుల కోసం చేసిన పోరాటం వల్లే ప్రభుత్వం దిగివచ్చి పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు.

అర్వింద్‌పై నిప్పులు : స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు మతిమరుపు రాజకీయాలు చేస్తున్నారని, అర్వింద్ కూడా అందులో ఒకరిని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆర్వీబీ రాలేదని అంటున్నాడు. తాను అధికారం కోల్పోయి ఏడేళ్లవుతున్నా ఆ బ్రిడ్జి పనులు ఎందుకు పూర్తి కాలేదు? ఎక్కడ మర్చిపోయారు? అని నిలదీశారు. 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి రైల్వేలైన్‌ను తాను పట్టుబట్టి మూడేళ్లలో సాధించానని ఈసందర్భంగా వివరించారు.

కార్యకర్తలకు పిలుపు : వచ్చే నెల 25న జరిగే పార్టీ ప్రకటన కార్యక్రమానికి జాగృతి నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటలకే మేడ్చల్‌కు చేరుకోవాలని సూచించారు. తాము ఎవరికీ ‘బీ’ పార్టీగా ఉండబోమని, నంబర్ వన్ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది పార్టీ ఆవిర్భావం తర్వాతే ప్రకటిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా తెలంగాణ జాగృతి నేతలు పాల్గొన్నారు.