
నేపాల్ మాజీ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి అరెస్టు అయ్యారు. గత ఏడాది జరిగిన ‘Gen Z’ నిరసనల్లో ఓలి పాత్ర ఉందన్న ఆరోపణలపై నేపాల్ పోలీసులు ఆయనను శనివారం అరెస్టు చేశారు. భక్తపూర్ జిల్లాలోని గుండులో ఉన్న ఓలి నివాసం నుండి నేపాల్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓలితో పాటు, ఆయన హయాంలో హోం మంత్రిగా పనిచేసిన రమేష్ లేఖక్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
గత సెప్టెంబర్‌లో జరిగిన ‘Gen Z’ నిరసనలను అణచివేసే క్రమంలో హత్య జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఓలిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు, తదుపరి ప్రక్రియ చట్టం ప్రకారం ముందుకు సాగుతుందని కాఠ్మండు లోయ పోలీసుల ప్రతినిధి ఓం అధికారి తెలిపారు.
‘Gen Z’ నిరసనల సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో విద్యార్థులు మరణించడంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ఒక కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. కమిషన్ సమర్పించిన నివేదికలో ఈ ఇద్దరు నాయకులను బాధ్యులుగా పేర్కొన్నారు.
ప్రధానమంత్రి బలేన్ షా అధ్యక్షతన జరిగిన మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే, విచారణ కమిషన్ నివేదికను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. విచారణ కమిషన్ నివేదికలో నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు దళం (Armed Police Force) మరియు సైన్యంలోని కొంతమంది అధికారుల ప్రవర్తనపై కూడా ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, ప్రస్తుతానికి ఆ భద్రతా దళాలపై ఎటువంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదు.