
టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మహిళలు, పిల్లలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఆటగాడు రిటైర్ కావడానికి అతడి ఇంట్లో ఉండే మహిళలు, పిల్లలే కారణం అని ఆయన అన్నారు. రిటైర్‌మెంట్‌కు ఫిట్‌నెస్‌తో సంబంధం ఉండదని, ఆటగాడి కెరీర్‌కు మహిళలు అడ్డుపడరాదని పేర్కొన్నారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘40 ఏళ్లు దాటిన తర్వాత మాకు వయసైపోతుందని చాలా మంది అనడం గమనిస్తున్నా. 30 ఏళ్ల తర్వాత మహిళలు ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారు’’ అని అన్నారు.
ఓ జిమ్ డైరెక్టర్‌గా తన జిమ్‌కు వచ్చే మహిళలకు, సీనియర్ సిటిజన్లకు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘క్రీడల్లో మాత్రం ఆటగాళ్ల రిటైర్‌మెంట్‌కు అతడి ఇంట్లోని మహిళలే కారణమని చెప్పగలను. ఒక ఆటగాడికి ఫిట్‌నెస్ సమస్యలు మొదలైన తర్వాత అతడి భార్య సలహాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. మీరు రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందని.. కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోవాల్సిన సమయం వచ్చిందని చెబుతారు. కానీ, నా దృష్టిలో ఒక గొప్ప అథ్లెట్ కెరీర్ విషయంలో మహిళలు తలదూర్చకూడదన్న విషయాన్ని గట్టిగా నమ్ముతాను. క్రీడాకారులకు ఫిట్‌నెస్‌తో సంబంధం లేదు. శక్తి ఉన్నంతవరకు ఆడాలన్నది నా అభిప్రాయం’’ అని యోగరాజ్ పేర్కొన్నారు.