
పార్లమెంట్, శాసనసభల్లో సభ్యుల సంఖ్య పునర్విభజన ఎప్పుడెప్పుడా అని ఎదిరిచూస్తున్న వారిని తృప్తిపరిచే వార్తను హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎం పి, ఎంఎల్‌ఎ స్థానాలను గంపగుత్తగా 50% పెంచాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లు ఉభయసభల్లో ఆమోదానికి మూడొంతుల మెజారిటీ కావాలి కాబట్టి అన్ని విపక్ష పార్టీలతో సమావేశాలకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని చట్టబద్ధత కల్పిస్తుంది. 2029లో జరగబోయే సాధారణ, శాసనసభ ఎన్నికల నుండి ఈ మార్పు వర్తిస్తుంది. ఈ పెంపుదలతో దేశంలో ఉన్న 4123 అసెంబ్లీ స్థానాలు 6186కి చేరుతాయి. 543 ఉన్న లోక్‌సభ స్థానాలు 816 కు పెరుగుతాయి. దక్షిణాదికి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో జనాభా ప్రాతిపదికన కాకుండా సమన్యాయం కోసం అన్ని ప్రాంతాలకు 50% సీట్లు పెంచడం జరుగుతుందని కేంద్రం అంటోంది.
దేశంలో ఇంతకు క్రితం 1952, 1962, 1972, 2002 లలో చట్ట సభల సీట్ల సర్దుబాటు కోసం డీలిమిటేషన్ కమిషన్‌ల ఏర్పాటు జరిగింది. జనాభా నియంత్రణ మూలంగా వివిధ రాష్ట్రాల్లో మారిన జనాభా వృద్ధి వ్యత్యాసం సభల్లో ప్రజాప్రాతినిధ్యానికి అడ్డంకి కావద్దని 2001 జనగణన తర్వాత ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు ముందుకు రాలేకపోయింది. అయితే కాలం గడిచినా కొద్దీ జనాభా పెరుగుదల, వలసల కారణంగా ఒకచోట 30లక్షల ఓటర్లు ఉంటే, మరోచోట ఆ సంఖ్య 50వేలకు పడిపోయింది. దీని వల్ల సీట్ల సర్దుబాటు అనివార్యమైంది. అయితే చట్టసభ సీట్ల పెంపుదలకు ఇంతవరకున్న జనసంఖ్య సూత్రం ఇప్పుడు పనికిరాదు. ఆ లెక్కన సీట్ల పునర్విభజన జరిగితే జనాభా పెరగని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ విధానాన్ని దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు పూర్తిగా వ్యతిరేకించాయి. అదే జరిగితే జనాభా పెరుగుదల గల ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగి కేంద్ర పాలనలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. దక్షిణ ప్రాంతంలో సీట్లు రాకున్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధిక్యతతో ఏ పార్టీ అయినా దేశాన్ని ఏలవచ్చు. విపులంగా చెప్పాలంటే దక్షిణాదిలో పట్టులేని బిజెపి కేవలం ఉత్తరాదిలోని నాలుగు, అయిదు రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించి ఢిల్లీ గద్దెను ఎక్కవచ్చు. ఇలా జరిగితే దక్షిణ రాష్ట్రాలు అభివృద్ధిని సాధించలేవు.
ప్రతి దానికి కేంద్రంలోని పార్టీ దయ దాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుంది. సీట్ల సవరణ చేపట్టి 24 ఏళ్ళు దాటుతున్నందువల్ల పాలనా సౌలభ్యం, ప్రజలకు అందుబాటు కోసం ఏదో లెక్కన ఓ అడుగువేయక తప్పనిస్థితి ప్రభుత్వానిది. అయితే ఏ శాస్త్రీయ దృక్పథం లేకుండా ఉన్న సీట్లను 50% పెంచేద్దామనడం ప్రయోజనశూన్య ఆలోచనే అవుతుంది. ఇంతవరకు జరిగిన పునర్విభజనలకు జన సంఖ్య, భౌగోళిక మార్పులు తదితర అంశాలు ప్రాతిపదికగా ఉండేవి. 1952లో జరిగిన డీలిమిటేషన్‌లో అప్పటివరకున్న లోక్‌సభ సీట్లలో 5 పెంచి 494కి స్థిరీకరించారు. రెండోసారి 1963 లో ఆ సంఖ్య 28 సీట్లు పెరిగి 522 కి చేరింది. 1973లో చేపట్టిన పునర్విభజనలో 21 సీట్లు పెరిగి లోక్‌సభ స్థానాలు 543 అయ్యాయి. 2002 లోని డీలిమిటేషన్ కమిషన్ కేవలం అసెంబ్లీ స్థ్థానాలను పెంచింది. చివరి పునర్విభజన 2001 నాటి జనగణన ఆధారంగా జరిగింది. ఇప్పటి సీట్ల సవరణకు జనగణన -2011 ప్రాతిపదికన జరగాలి.
2001 2011 మధ్య కాలంలో దేశజనాభా 18 కోట్లు పెరిగింది. ప్రస్తుత జనాభా 145 కోట్లు అంటున్నారు. కాబట్టి 2011 నుండి 2026 నాటికి మరో 24 కోట్లు పెరిగినట్లు. 1952 నుండి 2001 మధ్యకాలంలో అంటే యాభై ఏళ్లకు పెరిగిన ఎంపిల సంఖ్య 54 మాత్రమే. 25 ఏళ్ల కాలానికి ఏకంగా 273 పెరగడం అశాస్త్రీయమే. ఏ లెక్కన చూసినా ఒకేసారి సగం సీట్లు పెంచేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా నష్టకారకమే. ప్రస్తుతం ఎంపిల నెల జీతభత్యాలు కలిపితే రూ. 3 లక్షల దాకా ఉంటోంది. మాజీలకు నెలకు రూ. 31 వేల పెన్షన్ లభిస్తోంది. వారి సంఖ్య 50% పెరిగితే ఏడాదికి మరో వంద కోట్లు వారి ఖర్చులకు కేటాయించాలి. ఇలా దేశవ్యాప్తంగా ఎంఎల్ ఎల లెక్క తీస్తే అన్ని రాష్ట్రాల్లో కలిపి వేయి కోట్లయినా ఉంటుంది. వారందరికీ రాజధానుల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయ తదితర వసతుల కల్పన ఎంతో వ్యయభారాలతో కూడుకున్నది.
దీనికోసం ప్రజలపై పన్నుల భారం మోపడమే తప్ప ఆ ప్రజాప్రతినిధులతో ప్రజలకు కలిగే మేలు ఏమీ ఉండదు. ఇప్పుడున్న పాలనా స్థితిగతుల్లో పెద్దగా మార్పేమీ ఆశించలేం. సీట్ల పెంపువల్ల పార్టీ టికెట్ కోసం రాజకీయ పార్టీలపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. చట్ట సభలో ‘అధ్యక్షా!’ అని మైకులో అనాలని తపించేవారికి మార్గం సుగమమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనను అన్ని రాజకీయ పక్షాలు అంత తేలిగ్గా ఒప్పుకుంటాయనుకోం. ఇప్పటికైతే ఎన్‌డిఎ మిత్రపక్షాలతో చర్చలు జరిగాయి. విపక్షాలతో సంప్రదింపుల పర్వం మొదలుకానుంది. ఇందులోని సానుకూల అంశమేమిటంటే అన్నిరాజకీయ పార్టీలకు ఈ పెంపు సంబరమే. బిజెపి ప్రభుత్వ ప్రతిపాదనను అంత తేలిగ్గా ఒప్పుకోవద్దని కాంగ్రెస్ బెట్టు చేయవచ్చు. కానీ మొదటికే వ్యతిరేకించదు. భారమంతా ప్రజలపైనే కాబట్టి ఉభయసభల ఆమోదం కూడా సాధ్యమే.
– బి. నర్సన్, 94401 28169