
బంగారం ధరలు ప్రస్తుతం కాస్త ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ.. మున్ముందు బంగారం రేట్ల పరుగు ఆగదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. గోల్డ్ మార్కెట్‌లో అసలైన ‘బిగ్ వేవ్’ ఇంకా రావాల్సి ఉందని స్ప్రోట్ ఇంక్ సీనియర్ మేనేజింగ్ పార్టనర్ రియాన్ మెక్‌ఇంటైర్ అభిప్రాయపడ్డారు. అది ప్రభుత్వాలు లేదా సామాన్యుల నుంచి కాకుండా.. పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థల నుంచి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ బడా సంస్థలు రంగంలోకి దిగితే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయే అవకాశం ఉందని అన్నారు.
ప్రస్తుతం అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల స్వల్పకాలంలో బంగారం ధరపై ఒత్తిడి ఉందని చెప్పారు. సాధారణంగా బాండ్లు ఎక్కువ లాభాన్ని ఇస్తున్నప్పుడు.. వడ్డీ లేని బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు వెనుకాడతారు. అయితే ఈ ట్రెజరీ ఈల్డ్స్ ఎందుకు పెరుగుతున్నాయనేది ఇక్కడ ముఖ్యం. ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేయడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణాల వల్లే బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. ఇవే కారణాలు దీర్ఘకాలంలో బంగారానికి శ్రీరామరక్షగా మారుతాయి. ప్రభుత్వాలు భవిష్యత్తులో మరింతగా డబ్బును ముద్రించక తప్పని పరిస్థితులు వస్తాయని, అప్పుడు కరెన్సీ విలువ తగ్గి బంగారం విలువ పెరుగుతుందని మెక్‌ఇంటైర్ చెబుతున్నారు.
ఇంతకాలం బంగారం ధరలు పెరుగుతున్నా పెద్ద సంస్థలు ఎందుకు పెట్టుబడులు పెట్టలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం లభించింది. చాలా సంస్థలకు కమోడిటీస్, ముఖ్యంగా బంగారంపై సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, స్టాక్ మార్కెట్లు అద్భుతంగా రాణించడం మరో కారణంగా తేలింది. షేర్ మార్కెట్లలో లాభాలు వస్తున్నంత కాలం వారు కొత్త వైపు చూడలేదు. కానీ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లు పతనం కావడం మొదలవుతుందో.. అప్పుడు ఆ సంస్థలు తమ ఆస్తులను కాపాడుకోవడానికి బంగారమే సరైన మార్గమని భావించి రంగంలోకి దిగుతుంటాయి మెటల్స్ షాపింగ్ కోసం. అలాగే బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల వైపు మళ్లిన దృష్టి.. ఇప్పుడు మళ్లీ పాత బంగారు ఆభరణాల వైపు, బిస్కెట్ల వైపు మళ్లే అవకాశం ఉంది.
మరోవైపు వెండి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. వెండికి పారిశ్రామికంగా డిమాండ్ ఎక్కువైంది. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తుందనే ఆందోళన ఉంది. దీనివల్ల పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్ తగ్గవచ్చు. బంగారం తనకున్న ‘సురక్షితమైన పెట్టుబడి’ ఇమేజ్ వల్ల నిలదొక్కుకుంటుంది. కానీ వెండి మాత్రం పారిశ్రామిక మందగమనం వల్ల కొంత ఇబ్బంది పడవచ్చని నిపుణులు అంటున్నారు. పైగా బంగారం ధరలు పెరగడం మొదలైతేనే.. వెండి దానిని అనుసరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇరాన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల ప్రస్తుతానికి బంగారం ధరలు తగ్గినట్లు అనిపించినా.. దీర్ఘకాలంలో మాత్రం పసిడి మెరుపు తగ్గదు. ముఖ్యంగా సంస్థాగత పెట్టుబడిదారులు మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు బంగారం సరికొత్త గరిష్టాలను తాకడం ఖాయం. వెండి కూడా కొంతకాలం ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, బంగారం దారిలోనే నెమ్మదిగా పుంజుకునే అవకాశం ఉంది.