
ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో అట్టహాసంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత అల్లు శిరీష్, నయనిక పెళ్లి హైదరాబాద్ లో జరిగింది. ఇక ఇప్పుడు అందరి కళ్లు మరో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద పడ్డాయి. అయితే, ఈ మాస్ హీరో మాత్రం ఆడంబరాలకు దూరంగా, సంప్రదాయబద్ధంగా సాదాసీదాగా ఓ ఇంటివాడు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె నా ‘కావ్యమ్మ’..
గత కొంతకాలంగా తన ప్రేమ విషయంపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ.. ఈ నెల ప్రారంభంలోనే తన కాబోయే భార్య కావ్య రెడ్డిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశాడు శ్రీనివాస్. “నా కావ్యమ్మకు.. కాలం చాలా అందమైనది, అది నిన్ను నా జీవితంలోకి తీసుకువచ్చింది. నాపై నమ్మకం ఉంచి, నా ప్రతి రోజును సంతోషంతో నింపినందుకు ధన్యవాదాలు” అంటూ శ్రీనివాస్ రాసుకొచ్చిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. అప్పట్లో జరిగిన వేడుక ఎంగేజ్మెంట్ అని అందరూ భావించినప్పటికీ, అది కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చిన్న ‘అనౌన్స్‌మెంట్ ఈవెంట్’ మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.
తిరుపతిలో కళ్యాణం
లేటెస్ట్ సమాచారం ప్రకారం, బెల్లంకొండ – కావ్య రెడ్డిల వివాహ వేడుకలు వచ్చే నెలలో వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో సన్నిహితులు, అతికొద్ది మంది బంధువుల సమక్షంలో నిశ్చితార్థం జరగనుంది. ఏప్రిల్ 29న కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి సాక్షిగా, తిరుపతిలో అత్యంత సాదాసీదాగా వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. పెళ్లి సింపుల్‌గా ఉన్నప్పటికీ, టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా మే 1న రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి..
ఎవరీ కావ్య రెడ్డి?
చాలా కాలంగా శ్రీనివాస్‌తో స్నేహంలో ఉన్న కావ్య రెడ్డి, విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చారు. తన పెళ్లి ఆర్భాటంగా కాకుండా, పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ప్రశాంతంగా జరగాలని ఆమె కోరుకోవడంతోనే శ్రీనివాస్ తిరుపతిని వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే..
ఒకవైపు పెళ్లి పనులతో బిజీగా ఉన్న శ్రీనివాస్, మరోవైపు తన కెరీర్‌పై కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన ‘టైసన్ నాయుడు’ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నారు. అయితే ఆర్థిక కారణాల వల్ల షూటింగ్ కాస్త ఆలస్యమైనప్పటికీ, త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.