Reading Time: 2 minutes

ఏప్రిల్ 1 నుంచి డిజిటల్ పేమెంట్స్ రూల్స్ చేంజ్: ఇకపై OTP ఒక్కటే ఉంటే సరిపోదు

Caption of Image.

దేశంలో డిజిటల్ పేమెంట్స్ రూల్స్ విషయంలో ఏప్రిల్ 1, 2026 నుండి ఒక కీలక మార్పు రాబోతోంది. ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి మరియు సామాన్యుల సొమ్ముకు మరింత రక్షణ కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనలను అమలులోకి తెస్తోంది. దీని ప్రకారం ఇకపై ప్రతి డిజిటల్ లావాదేవీకి ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ తప్పనిసరి కానుంది. కేవలం బ్యాంకులు మాత్రమే కాకుండా.. పేమెంట్ యాప్స్, వాలెట్లు వంటి నాన్-బ్యాంకింగ్ సంస్థలన్నింటికీ ఈ నియమం వర్తిస్తుంది.

ఇప్పటివరకు మనం చేసే డిజిటల్ చెల్లింపుల్లో ఎక్కువగా వన్-టైమ్ పాస్‌వర్డ్ పైనే ఆధారపడేవాళ్లం. అయితే సైబర్ నేరగాళ్లు ఓటీపీలను సులభంగా దొంగిలిస్తుండటంతో.. ఆర్‌బీఐ ఈ పాత పద్ధతికి స్వస్తి పలికి మరింత పటిష్టమైన భద్రతను కోరుతోంది. కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడికి తెలిసిన సీక్రెట్ PIN లేదా పాస్‌వర్డ్, వినియోగదారుడి వద్ద ఉండే కార్డ్.. వినియోగదారుడికి మాత్రమే ఉండే బయోమెట్రిక్స్ వంటి అంశాల కలయికతో ఈ కొత్త పేమెంట్ అథెంటికేషన్ ప్రక్రియ ఇకపై జరగనుంది.

ఏప్రిల్ 1 నుండి వినియోగదారులు డిజిటల్ లావాదేవీలు జరిపేటప్పుడు కేవలం ఓటీపీతో సరిపెట్టలేరు. దానితో పాటు ఫింగర్ ప్రింట్, పిన్ నంబర్ లేదా డివైస్-స్పెసిఫిక్ కోడ్ వంటి మరొక అదనపు భద్రతా వలయాన్ని దాటాల్సి ఉంటుంది. ఈ రెండు అథెంటికేషన్ కారకాల్లో ఒకటి కచ్చితంగా ఆ లావాదేవీకి మాత్రమే పరిమితమైనదై ఉండాలి. అంటే ఒక లావాదేవీకి వాడిన కోడ్ లేదా మెకానిజం మరొక దానికి పనికిరాదు. ఒకవేళ పొరపాటున ఒక భద్రతా కోడ్ హ్యాకర్ల చేతికి చిక్కినా, రెండో వలయాన్ని దాటడం వారికి అసాధ్యమవుతుంది.

వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ఆర్‌బీఐ మరో కీలక ఆదేశాన్ని ఇచ్చింది. ఈ భద్రతా పద్ధతులను అమలు చేయడంలో ఏవైనా లోపాలు జరిగి.. దానివల్ల కస్టమర్ డబ్బు నష్టపోతే, దానికి ఆయా బ్యాంకులు లేదా పేమెంట్ సంస్థలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధితులకు జరిగిన నష్టాన్ని ఆ సంస్థలే భర్తీ చేయాలి. అలాగే విదేశీ లావాదేవీల కోసం అక్టోబర్ 1, 2026 నాటికి మరింత శక్తివంతమైన రిస్క్-బేస్డ్ మెకానిజంను సిద్ధం చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. మొత్తానికి ఈ మార్పుతో డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితం కానున్నాయి.

©️ VIL Media Pvt Ltd.