
- పార్లమెంట్ ప్యానెల్ వెల్లడి
- దేశంలోని 754 విమానాలకుగాను
- 377 విమానాల్లో రిపీటెడ్ లోపాలు
- ఇండిగో, ఎయిర్ ఇండియా
- విమానాల్లోనే అధిక సమస్యలు
న్యూఢిల్లీ: దేశ పౌర విమానయాన రంగంలో దాదాపు 50 శాతం విమానాల్లో లోపాలు ఉన్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహించిన ఆడిట్లో మొత్తం 754 వాణిజ్య విమానాలకుగాను 377 విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ఇండిగో విమానాలే అధికంగా ఉన్నాయి. 405 ఇండిగో విమానాలకుగాను 148 విమానాల్లో సాంకేతిక సమస్యలు పునరావృతమవుతున్నట్లు తెలుస్తోంది. 166 ఎయిర్ ఇండియా విమానాలకుగాను 137 విమానాల్లో లోపాలు కనిపించాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 101 విమానాలకుగాను 54 విమానాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ప్రత్యేక ఆడిట్..
అహ్మదాబాద్‌లో 270 మంది చనిపోయిన విమాన ప్రమాదం తర్వాత గతేడాది జూలైలో డీజీసీఏ ఎయిర్ ఇండియాపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. ఈ తనిఖీలో సుమారు 100 భద్రతా లోపాలు బయటపడగా, అందులో 7 లెవెల్-1 అత్యవసర ఉల్లంఘనలు ఉన్నాయి. బోయింగ్ 787, 777 విమానాల పైలట్లలో శిక్షణ లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది.
డీజీసీఏ చర్యలు, జరిమానాలు..
భద్రతా ఉల్లంఘనలపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియాకు తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2025 చివరి నాటికి మొత్తం 19 నోటీసులు వివిధ ఆపరేటర్లకు జారీ అయ్యాయి. ఎయిర్‌వర్థినెస్ సర్టిఫికేట్ లేకుండా విమానాలు నడిపిన ఘటనలో, 2026 ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియాపై రూ. కోటి జరిమానా విధించారు. డీజీసీఏలో 48.3 శాతం సిబ్బంది ఖాళీలు ఉండటం కూడా కమిటీ తీవ్రంగా పరిగణించింది.