Reading Time: < 1 minute

ఎల్‌పిజి, సిఎన్జీ కొరతతో ఆటోలు, క్యాబ్‌లు రోడ్డెక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఊబర్, ర్యాపిడ్‌లో ఆటోలు, క్యాబ్‌లను బుక్ చేసుకుంటే క్యాన్సిల్ అవుతున్నాయి. ఒకవేళ బుక్ అయినా చార్జీలను అధికంగా పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఆటోలకు ఎల్‌పిజి గ్యాస్ దొరకడం కష్టంగా మారింది. ప్రస్తుతం పిల్లింగ్ స్టేషన్‌ల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. సిఎన్జీ కొరతతో క్యాబ్ డ్రైవర్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌లోని లక్డీకాపూల్, ఖైరతాబాద్, అత్తాపూర్, ఎల్‌బినగర్ తదితర ప్రాంతంలో సీఎన్జీ, ఎల్‌పిజి గ్యాస్ కోసం బంకుల వద్ద ఆటోలు, క్యాబ్‌లు బారులు తీరుతున్నాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లో వాహనదారులు వేచి ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో పెట్టిన ఆటోలయితే తెల్లవారుజాము వరకు బంక్ దగ్గరే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంధన కొరతపై వస్తున్న వదంతులతో తీవ్రమైన రద్దీ నెలకొందని బంక్ యజమానులు పేర్కొన్నారు.