Reading Time: < 1 minute
Congress 24 Akbar Road Hq Relief Supreme Court Property Verdict Delhi

Congress: గత కొంతకాలంగా ఢిల్లీలోని తన చారిత్రక ప్రధాన కార్యాలయం ’24 అక్బర్ రోడ్’ విషయంలో సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక ఊరట లభించింది. ఈ బంగ్లాలో మరికొన్ని నెలల పాటు కొనసాగేందుకు పార్టీకి అనుమతి లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, భవిష్యత్తుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలతో జరిగిన అనధికారిక చర్చల అనంతరం, కాంగ్రెస్‌కు ఈ బంగ్లాలో ఉండేందుకు మరికొంత కాలం గడువు లభించింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇది ఒక ‘టైమ్-బైయింగ్’ ఏర్పాటుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

READ ALSO: Nepal Political Crisis: నేపాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అరెస్ట్స్.. మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!

24 అక్బర్ రోడ్‌ను తమ ఆధీనంలోనే ఉంచుకోవడానికి కాంగ్రెస్ సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. నిబంధనల ప్రకారం.. ఈ బంగ్లాను ఎవరో ఒకరు సీనియర్ నాయకుడి పేరు మీద (మాజీ ముఖ్యమంత్రులు లేదా మాజీ కేంద్ర మంత్రుల కేటగిరీలో) కేటాయించేలా ప్లాన్ చేస్తోంది. ఈ జాబితాలో అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ వంటి హేమాహేమీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రధాన కార్యాలయానికి ఉపశమనం లభించినప్పటికీ, 5 రైసినా రోడ్‌లో ఉన్న యూత్ కాంగ్రెస్, NSUI కార్యాలయాలపై మాత్రం ముప్పు పొంచి ఉంది. అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి రావచ్చనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

సుప్రీంకోర్టు తీర్పుతో బిగ్ రిలీఫ్..
మరోవైపు, 1970ల నాటి పార్టీ విభజన ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు పెద్ద ఊరటనిచ్చింది. పాత ఆస్తులపై కాంగ్రెస్‌కే ప్రాథమిక హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ప్రభావం జంతర్ మంతర్ వద్ద ఉన్న పాత ప్రధాన కార్యాలయంపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే, కొన్ని విభాగాలను జంతర్ మంతర్ భవనంలోకి మార్చాలని పార్టీ యోచిస్తోంది. కర్ణాటకతో సహా దేశంలోని పలు చోట్ల కోర్టు తీర్పు ఆధారంగా తమ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.

READ ALSO: Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!