Reading Time: 2 minutes

సీతారాములు లోకానికి ఆదర్శమూర్తులు: మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.
  • ఆయన చూపిన బాటలో ప్రజలు నడవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి 
  •     రాముడి ఆశీస్సులతో చెన్నూరును అభివృద్ధి చేస్తానని వెల్లడి 
  •     మంచిర్యాల జిల్లాలో పలు ఆలయాల్లో -రాములోరి కల్యాణానికి పట్టువస్ర్తాలు సమర్పించిన వివేక్‌‌ దంపతులు

కోల్​బెల్ట్, వెలుగు: శ్రీరాముడు ఆచరించిన జీవితం అందరికీ ఆదర్శనీయమని, సీతారాములే ఈ లోకానికి ఆదర్శమూర్తులని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన ఆశీస్సులతో చెన్నూరు నియోకజవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి, జైపూర్, భీమారం, చెన్నూరు మండలాల్లోని పలు రామాలయాలు, హనుమాన్ టెంపుల్స్‌‌లో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి-, సరోజ దంపతులు పాల్గొని, స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయాల అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా మందమర్రి పంచముఖ అంజనేయస్వామి ఆలయం, మూడో జోన్ కోదండ రామాలయంలో వేర్వేరుగా జరిగిన రాములోరి కల్యాణ వేడుకల్లో కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ విప్ నల్లాల ఓదెలు – -భాగ్యలక్ష్మి, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్. రాధాకృష్ణ–- శ్రీవాణి దంపతులు, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి వివేక్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడు విలువలతో కూడిన రాజ్య పాలన చేశాడని, భారతీయ సంస్కృతిలో ఆయన జీవితం గొప్ప మార్గదర్శకమన్నారు. ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో మంచి పనులు చేస్తూ ఆయన చూపిన బాటలో నడవాలని సూచించారు. శాంతి, సహనం, విశ్వాసం, కష్టనష్టాలను అధిగమించే స్థైర్యం వంటి విలువలు శ్రీరాముడి జీవితం మనకు నేర్పుతుందని చెప్పారు. 

ప్రజల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్నం.. 

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలు, రైతులు, యువతకు అండగా నిలుస్తూ వారికి మేలు కలిగించే సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. రైతుల కోసం రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు రూ.500 బోనస్​ అందిస్తున్నామని తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా మరో 4 లక్షల ఇండ్లను సాంక్షన్ చేయనుందన్నారు. అలాగే, రెండు లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించినట్లు చెప్పారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో ఇంటింటికి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం రూ.100 కోట్లతో అమృత్ స్కీం పనులు చేపట్టామని వెల్లడించారు. మరోవైపు, శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెన్నూరు నియోకవర్గంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోని రామాలయాలు, హనుమాన్​టెంపుల్స్‌‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి, -సరోజ దంపతులు సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి వెంట బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, మందమర్రి తహసీల్దార్ సతీశ్, సీఐలు పర్స రమేశ్, బన్సిలాల్, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీ కమిషనర్లు మారుతీ ప్రసాద్, తుంగపిండి రాజలింగు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌‌లు, కాంగ్రెస్ లీడర్లు తదితరులు ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.