Reading Time: < 1 minute

శ్రీనగర్–లేహ్ హైవేపై విరిగిపడ్డ మంచు చరియలు.. ఏడుగురు మృతి

Caption of Image.

శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్‎లో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగి రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జోజిలా పాస్‌లోని జీరో పాయింట్, మినిమార్గ్ మధ్య ప్రాంతంలో శుక్రవారం (మార్చి 27) మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. 

సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. గందర్‌బల్ పోలీసులు, విపత్తు నిర్వహణ అధికారులతో కలిసి మంచు చరియలు కింద వాహనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహయక చర్యలు కొనసాగిస్తున్నారు.

 ప్రమాదానికి గురైన  వాహనాలు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి కార్గిల్‌కు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. హిమపాతం కురవడంతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని అధికారులు క్లోజ్ చేశారు. ఈ ఘటనపై లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా స్పందించారు. జోజి లా పాస్ దగ్గర హిమసంపాతం సంభవించి ఏడుగురు మరణించడం దురదృష్టకరమన్నారు.

 మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాచారం అందిన వెంటనే కార్గిల్ డీసీ, ఎస్ఎస్పీలను ఘటన స్థలానికి వెళ్లి సహయక చర్యలు చేపట్టాలని ఆదేశించానని తెలిపారు. విపత్తు సహాయక దళాలు, బీఆర్ఓతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలను హై అలర్ట్‌లో ఉంచానని.. పరిస్థితిని వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.