Reading Time: < 1 minute

ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSKకు బిగ్ షాక్ తగిలింది. కండరాల గాయంతో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ధోనీ మొదటి 2 వారాలు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది.

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. పిక్క కండరాల గాయంతో ధోనీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాను వేదికగా తెలియజేసింది. ప్రస్తుతం ధోనీ చికిత్స పొందుతున్నాడని.. దీంతో ఈ సీజన్‌లోని మొదటి రెండు వారాల మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వెల్లడించింది.

చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. మార్చి 30న గువహటిలోని బర్సపరా స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లకు ధోనీ దూరం కానున్నాడు. ఎప్పుడు తిరిగి జట్టులోకి అడుగుపెడతాడు అన్న విషయాలను గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది.

కాగా, టీమిండియాకు వీడ్కోలు పలికిన తర్వాత గత కొన్నేళ్లుగా ధోనీ కేవలం IPLలో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి గాయాలు వేధిస్తున్నప్పటికీ తరచుగా మ్యాచ్‌లు ఆడుతూ.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ అండగా నిలిచాడు. 2023లో ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి జట్టుకు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.