Reading Time: < 1 minute

ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. కేరళ రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం ఆ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్‌గా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాషపై పట్టు ఉండడం, హావభావాల పట్ల ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ముగ్దుడైనందున ప్రత్యేకించి ఆ రాష్ట్రానికి ఎంపిక చేసి ఉంటారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. పైగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం కూడా ఆ రాష్ట్రంలోనే ఉండడం గమనార్హం.

కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ కూటమిని అధికారంలోకి తీసుకుని రావాలన్న పట్టుదలతో అధిష్టానం ఉంది.ఇదిలాఉండగా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు జరిగనున్న ఎన్నికలకు రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌నూ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు. అయితే ప్రధాన స్టార్ క్యాంపెయినర్లుగా ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రభృతులు ఉన్నారు.