
IPL 2026 Bangladesh Broadcast: నేడు ఐపీఎల్ ప్రారంభం కానుంది. అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో బంగ్లాదేశ్‌ను నుంచి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రసారానికి బంగ్లాదేశ్‌లో మార్గం సుగమమైంది. దేశంలో ఈ టోర్నమెంట్ ప్రసారంపై ఎలాంటి ఆంక్షలు లేవని కొత్తగా నియమితులైన సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ధృవీకరించారు. క్రీడలతో రాజకీయాలను కలపడం తమ ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని బీసీసీఐ కోరడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అయితే, ఇప్పుడు ఆ పాత ఉత్తర్వులకు విలువ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. “మేము క్రీడల్లో రాజకీయాలను కలపదలుచుకోలేదు. ఏదైనా ఛానెల్ ఐపీఎల్ ప్రసారం కోసం దరఖాస్తు చేసుకుంటే సానుకూలంగా స్పందిస్తాం” అని మంత్రి స్వపన్ పేర్కొన్నారు. స్టార్ స్పోర్ట్స్ వంటి అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు కూడా బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ను ప్రసారం చేసుకోవచ్చని, ప్రభుత్వం ఎవరినీ బలవంతం చేయదని లేదా అడ్డుకోదని వివరించారు.
ఇదిలా ఉండగా.. గతంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ విషయంలో జరిగిన పరిణామాల గురించి తెలిసిందే. బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను (Mustafizur Rahman) ఐపీఎల్ (IPL) 2026 మినీ వేలంలో రికార్డు ధర రూ.9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) దక్కించుకోవడంపై వ్యతిరేకత వ్యక్తమైది. ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ గతంలో కేకేఆర్‌కు ఆదేశాలిచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. దీంతో రెహమాన్‌ను కేకేఆర్ రిలీజ్ చేసింది.