
ఈ నెల 31న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జరిగే మహిళా రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, టి సాగర్, కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఆర్‌టిసి క్రాస్ రోడ్ లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మహిళా రైతుల రాష్ట్ర సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు వివిధ జిల్లాల నుండి మహిళా రైతులు హాజరవుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతున్న కొద్ది పురుషుల సంఖ్య తగ్గి మహిళల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. వ్యవసాయాన్ని మహిళలే కొనసాగిస్తున్న పరిస్థితి ఉందని, వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వాలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇందులో భాగంగానే విత్తనబిల్లు, మార్కెట్ ముసాయిదా బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులు తీసుకొచ్చారు. గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్న అవకాశాలను కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు భూమిపై ఎలాంటి హక్కులు లేవు, జాయింట్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికి ఎన్నికలకు ముందు పాలకులు వాగ్ధానాలు చేస్తున్నారే తప్ప ఆచరణలో అమలు కావడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి సందర్భంగానైనా ఈ అంశం ఉండే విధంగా చూసుకుంటే ఉపయోగకరంగా ఉండేదని సూచించారు. కౌలు రైతులలో కూడా మహిళలు గణనీయంగా ఉన్నారని, వీరికి పెట్టుబడి కోసం జాయింట్ లయబుల్ గ్రూపులను ఏర్పాటు చేసి వీటి ద్వారా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అరిబండి ప్రసాద రావు, పెసరగాయల జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితలులు పాల్గొన్నారు.