
మన తెలంగాణ/కరీంనగర్ క్రైం: సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌పై కరీంనగర్ పోలీసులు సర్జికల్ స్ట్రైక్ చేశారు. ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ పేరుతో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రూ.138కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర సైబర్ ముఠాను పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం 24మంది నిందితులను గుర్తించగా, అందులో మేనేజర్‌తో సహా 13మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనరేట్ హా ల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. సిపి తెలిపిన వివరాల ప్రకారం నిందితులు రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ కొన్ని వర్చువల్ ఖాతాల ద్వారా భారీ ఎత్తున నిధులను మళ్లించినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆర్‌బిఎల్ మ్యూల్ ఖాతాల ద్వారా: రూ.125.80 కోట్లు, వర్చువల్ ఖాతాల ద్వారా రూ.12.25 కోట్లు. సుమారు రూ.138 కోట్లు నేరగాళ్ల చేతులు మారినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.
నేరగాళ్ల పద్ధతి
సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, కొద్దిపాటి కమిషన్ ఆశచూపి వారి పేరుతో ’మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ను ఈ ముఠా తెరిపిస్తోంది. ఈ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్ వివరాలను నేరగాళ్లు తమ ఆధీనంలో ఉంచుకుని, సైబర్ మోసాల ద్వారా వచ్చిన సొమ్మును విదేశాలకు మళ్లిస్తున్నారు. ఈ ప్రక్రియలో సమన్వయకర్తలు, మధ్యవర్తులు,ఖాతాదారులు ఒక గొలుసుకట్టుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అరెస్టయిన వారిలో కీలక సూత్రధారులతో పాటు బ్యాంక్ అధికారులు అయినా భువనగిరి కళ్యాణ్ (ఆర్‌బిఎల్ బ్యాంక్ మేనేజర్, హన్మకొండ), అయేషా బేగం (కరీంనగర్)ఉండటం గమనార్హం.ముఖ్య నిందితులు అయినా బండారి సాయిరాం, అనుమాండ్ల రంజిత్, అలిగేటి మల్లేశం, బోగ రాకేష్, బండి ప్రణయ్ లను అరెస్ట్ చేశారు. ఖాతాదారులు విభూది రాంకుమార్, నతర్ల శ్రీనివాస్, కర్రే రాజు, కల్లెడ మహేందర్, కొండ్ర నరహరి, కల్లెడ రాజేష్ వీరిపై భారత న్యాయ సంహిత సెక్షన్లు 112, 318(4) ఐటీ యాక్ట్ సెక్షన్ 66- డి కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
పోలీస్ కమిషనర్ హెచ్చరిక
‘డబ్బుల ఆశతో మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను, ఏటీఎం కార్డులను ఇతరులకు అప్పగించకండి. అలా చేస్తే మీరు కూడా నేరస్థులుగా పరిగణించబడతారని పోలీస్ కమిషనర్ ప్రజలను హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన 11 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.