
భారతదేశం తన రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా దశాబ్దాలుగా స్థిరంగా ఉన్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే ది శగా కేంద్రం ఆలోచనలు వేగవంతమయ్యాయి. 2026 తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 816కు, అలాగే దేశవ్యాప్త అసెంబ్లీ స్థానాలను 4,123 నుంచి 6,185కు పెంచాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు మాత్రమే కాదు. దేశ సమాఖ్య స్ఫూర్తిని, ముఖ్యంగా ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే కీలక అంశంగా భావించాలి. ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ (నారీ శక్తి వందన్ అధినియం) అమలును సులభతరం చేయడం కోసమే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పెంచిన స్థానాల్లో 33% (అంటే సుమారు 273 లోక్‌సభ సీట్లు) మహిళలకు కేటాయించడం ద్వారా, ప్రస్తుతం ఉన్న పురుష ప్రతినిధుల సంఖ్య తగ్గకుండానే మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రాజకీయ సమీకరణాల్లో ఘర్షణలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల నియోజకవర్గాల పరిధి తగ్గి, ప్రజలకు పాలన మరింత చేరువవుతుంది.
- దక్షిణాదిపై ప్రభావమెంత?
దక్షిణాది రాష్ట్రాలపై ఈ మార్పుల ప్రభావం గురించి ఇటీవల చర్చలు కొనసాగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పునర్విభజనకు తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు ముందుగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జనాభా నియంత్రణలో విజయవంతంగా నిలిచి అభివృద్ధిలో ముందంజలో ఉన్న ఈ రాష్ట్రాలకు, కేవలం జనాభా ఆధారంగా సీట్లు కేటాయించడం అన్యాయమని ఆయా ముఖ్యమంత్రులు వాదించారు. అలాంటి విధానం అమలైతే ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి అధిక జనాభా రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం దక్కి, దక్షిణాది ప్రభావం తగ్గే ప్రమాదం ఉందని భావించారు. అయితే, ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కొంత మేరకు ఉపశమనం కలుగుతుంది.
-
రాజకీయ వారసుల కోసమా?
పెరుగుతున్న రాజకీయ వ్యవస్థలో నాయకులకు తగినవిధంగా సీట్ల కేటాయింపు చేయడం ఏ ఒక్క రాజకీయ పార్టీకి సులభం కావడం లేదు. ఒక పార్టీలో అవకాశం దక్కనివారు స్వతంత్ర (రెబల్) అభ్యర్థులుగా పోటీ చేయడం లేదా ఇతర పార్టీలకు మారి అక్కడి నుంచి పోటీ చేయడం సాధారణంగా మారింది. ఈ పరిస్థితి రాజకీయ పార్టీలకు అంతర్గత విభేదాలు, అసంతృప్తి వంటి సమస్యలను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో సీట్లను 50% వరకు పెంచడం ఒక పరిష్కార మార్గంగా చెప్పవచ్చు.
సీట్ల పెంపుతో కొత్త నాయకులకు, ముఖ్యంగా యువతకు, మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. దీంతో పార్టీల్లో నాయకత్వ వికాసం జరిగి, కొత్త ఆలోచనలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అదనంగా, ఇది రాజకీయంగా ఉపాధి అవకాశాల పెంపునకూ దోహదపడుతుంది. అయితే, ఇదే సమయంలో ప్రముఖ నేతల వారసులకు కూడా రాజకీయ ప్రవేశం సులభమయ్యే అవకాశం ఉంది. ఇది రాజకీయాల్లో వారసత్వ ధోరణి పెరుగుదలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.
రాజకీయ పరోక్ష ఉద్యోగ అవకాశాలు
పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను 50% పెంచడం అనేది కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఇది యువతకు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలను తీసుకురానుంది. నేరుగా రాజకీయాల్లోనే కాకుండా, అనుబంధ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రతి కొత్త ఎంపీ, ఎమ్మెల్యేకు కనీసం 5 నుంచి 10 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ఇందులో పర్సనల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సోషల్ మీడియా మేనేజర్లు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు వంటి పోస్టులకు డిమాండ్ పెరుగుతుంది.
అలాగే ప్రతి నియోజకవర్గంలో కార్యాలయాలు ఏర్పడడంతో లోకల్ సెక్రటరీలు, అకౌంటెంట్లు, ఫీల్డ్ వర్కర్లకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఎన్నికల సమయంలో వ్యూహాలు రూపొందించే సంస్థలకు కూడా అవకాశాలు పెరుగుతాయి. అభ్యర్థులకు డేటా అనలిస్టులు, సర్వే టీమ్స్, స్ట్రాటజిస్టులు అవసరం అవుతారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే సర్వే ఏజెంట్లకు, సెఫాలజీ తెలిసినవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీడియా రంగంలోనూ కొత్త నియోజకవర్గాల వార్తలను కవర్ చేయడానికి రిపోర్టర్లు, స్ట్రింగర్లు అవసరం పెరుగుతుంది.
ప్రజాస్వామ్యం విస్తరణ
డిజిటల్ ప్రచారం కోసం గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, కంటెంట్ రైటర్లకు అవకాశాలు ఎక్కువ అవుతాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతుంది. క్లర్కులు, మార్షల్స్, రిపోర్టర్లు వంటి పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. కొత్త కార్యాలయాలు, రోడ్లు నిర్మించడంతో ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, కూలీలకు ఉపాధి లభిస్తుంది. జర్నలిజం, డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా రంగాల్లో ఉన్న యువతకు ఇది మంచి అవకాశం. మొత్తంగా ఈ మార్పు వల్ల లక్షకు పైగా పరోక్ష ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది.
ప్రపంచంలో ప్రజాస్వామ్యానికే మాతృకగా నిలిచిన భారతదేశంలో ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంచడం అంటే ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తరించడమే. ఈ విస్తరణ ద్వారా మహిళలు, యువతకు రాజకీయాల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం లోక్‌సభలో సుమారు 14% మాత్రమే ఉండగా, ఇది 33% పెరుగుతుంది. కానీ నాణ్యమైన నాయకత్వం, పారదర్శకత, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టినప్పుడే ఈ మార్పుకు అసలు అర్థం ఉంటుంది.
-కందుకూరి రాకేష్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.