
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పెట్రోలు, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ గురువారం అర్థరాత్రి నోటిఫికేషన్ వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ సంక్షోభం, హర్మూజ్ జలసంధి మారంగంలో రవాణాకు అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగకుండా ఉండేందుకు, క్రమేపీ గణనీయంగా తగ్గేందుకు ఈ సుంకం తగ్గింపు నిర్ణయం దారితీస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పెట్రోలుపై ఇంతకు ముందు ఉన్న లీటర్‌కు రూ.13 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ ఇకపై రూ.3గా కుదించారు.
డీజిల్‌పై ఇది ఇంతకు ముందు రూ 10 ఉండగా దీనిని ఇప్పుడు పూర్తిగా ఎతివేశారు. ఈ చర్యతో ప్రభుత్వ ఖజానాకు దాదాపుగా రూ 1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఈ సుంకం భారీ స్థాయి తగ్గింపు వల్ల ముందుగా చమురు పంపిణీ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. క్రమేపీ దీని పరిణామాలలో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీ స్థాయిలోనే తగ్గుతాయి. పైగా చమురు సంక్షోభం దశలో వెనువెంటనే దేశంలో ఇందన ధరలు పెరగకుండా ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి నిర్ణయాలలో భాగంగా ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్)పై సుంకాలను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో డీజిల్‌పై ఇది లీటర్‌కు రూ 21.5గా ఉంటుంది. ఎటిఎఫ్‌పై ఇది రూ 29.5గా పడుతుంది.
ధరల్లో మార్పు ఉండదు: ఆర్థిక మంత్రి
కేంద్రం పెట్రోల్‌పై సుంకాలను తగ్గించినా డీజిల్‌పై లేకుండా చేసినా వెనువెంటనే ఈ సవరణలతో పెట్రోల్ పంపులలో ధరలలో మార్పు ఉండదు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో వినియోగదారులపై ఇంధన ధరల పెంపు ప్రభావం పడకుండా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. సరఫరాల హెచ్చుతగ్గులు, సంక్షోభ ప్రభావం వినియోగదారులపై పడకుండా చేయడానికే ఈ నిర్ణయం ఉపకరిస్తుందన్నారు. ఈ దిశలోనే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ముడిచమురు ధరల ప్రభావంతో అంతర్జాతీయంగా పలు దేశాలలో గడిచిన నెలరోజుల్లో విపరీత ప్రభావం పడిందన్నారు. అంతకు ముందు బ్యారెల్‌కు 70 డాలర్లు ఉండగా ఇది ఇప్పుడు 100 డాలర్లు దాటుతోందని అన్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులపై పెట్రోలు,
డీజిల్ ధరల ప్రభావం అన్ని దేశాలలో పడుతోందన్ని, ఆగ్నేయాసియా దేశాలలో ఈ ధరలు దాదాపుగా 30 నుంచి 50 శాతం పెరిగాయన్నారు. ఆఫ్రికా దేశాలలో ఇది 20 నుంచి 50 శాతంగా పెరిగాయని, ఈ దశలో భారత్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, దానిని నివారించేందుకు ప్రభుత్వం వద్ద రెండే మార్గాలు ఉన్నాయన్నారు. ఒకటి ధరలు గణనీయంగా పెంచడం లేదా ప్రభుత్వ సంస్థలుఈ భారం భరించడం అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం వెలువడిందని మంత్రి తెలిపారు. ఇప్పటికిప్పుడు ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఇంధన ధరలు వెంటనే మార్కెట్‌లో దిగకపోవచ్చు. అయితే ఇప్పుడు సుంకం కుదింపుతో వెనువెంటనే అనివార్యంగా జరగాల్సిన రీతిలో ఇంధనల ధరలు పెరిగే అవకాశం ఉండదు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ విషమ పరిస్థితికి కళ్లెం పడిందని విశ్లేషిస్తున్నారు.
ఎన్నికలపై దృష్టితోనే : కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాల కోతకు దిగింది కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లాభం పొందేందుకే అని కాంగ్రెస్ విమర్శించింది. గతంలో పలుసార్లు అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు ఏడుసార్లు పడిపోయినా దేశంలో వినియోగదారులకు ధరల వెసులుబాటు కల్పించలేదని , ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం ఈ నాటకమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ఎప్రిల్ 30 వరకూ చూడండీ ఈ ప్రభుత్వమే తిరిగి ఏ విధంగా దెబ్బ తీస్తుందో అన్నారు.
ప్రతిపక్షాల దుష్ప్రచారం: బిజెపి
ఇంధన ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి దిగుతున్నాయని బిజెపి ఎదురుదాడికి దిగింది. కేం ద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇకపై వినియోగదారులకు ఇంధనం తక్కువ ధరలకు దొరుకుతుందని, కాంగ్రెస్ ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.