Reading Time: < 1 minute

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత… అలీ ఖమేనీ మృతిపై ఎన్సీ ఎమ్మెల్యేల నిరసన

Caption of Image.
  •     అమెరికా, ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా నినాదాలు
  •     కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట
  •     సభను అరగంటపాటు వాయిదా వేసిన స్పీకర్​ 

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్యను నిరసిస్తూ శుక్రవారం నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఎన్సీ ఎమ్మెల్యేలు ఖమేనీ చిత్రపటాలను ప్రదర్శిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ హఫీజ్ లోన్, బీజేపీ ఎమ్మెల్యే యుద్వీర్ సేథీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

సభ్యుల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఎన్సీ ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇరాన్‌కు పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. 

ఒక దేశంపై మరో దేశం దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్నారు. ఈ దాడులను  భారత ప్రభుత్వం వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫిబ్రవరి 28, 2026న జరిగిన వైమానిక దాడుల్లో మరణించినట్లు వెలువడిన వార్తలపై అప్పట్లో సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అసెంబ్లీలో కూడా పీడీపీ, వామపక్ష పార్టీల సభ్యులు ఎన్సీకి మద్దతుగా ఇజ్రాయెల్ కు వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు బీజేపీ సభ్యులు జమ్మూలో నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో సభ హోరెత్తిపోయింది. 

©️ VIL Media Pvt Ltd.