
శ్రీనగర్‌లేహ్ జాతీయ రహదారిపై శుక్రవారం మంచు చరియలు విరిగి పడటంతో ఏడుగురు మృతి చెందగా, మరో ఐదు మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జీరో పాయింట్ నుంచి మినిమార్గ్ మధ్య మధ్యాహ్న సమయంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. భారీగా కురిసిన మంచు కారణంగా పలు వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ (బీఆర్‌వో), పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మంచును తొలగించడంతో పాటు ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాయి.
ఈ ప్రమాదంపై లద్దాఖ్ గవర్నర్ వీకే సక్సేనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.