Reading Time: 4 minutes

పగటి నాటకాలకు, సాయంత్రం నాటకాలకు తేడా ఏమిటి? నాటకం అదే అయినా పగలు వేస్తే ప్రజలు తమ పనుల్లో ఉంటారు గనుక తీరిక ఉండే కొద్ది మంది తప్ప రారు. సాయంత్రమైతే చాలా మంది వెళతారు. ఇరాన్ యుద్ధం విషయమై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం చేసిన ప్రతిపాదనలు పగటి నాటకం వంటివే. ఎందుకంటే, వాటిని అమెరికన్లతో సహా ఎవరూ విశ్వసించటం లేదు గనుక. అందువల్లనే, తన జీవితంలో టివి షో మ్యాన్ పాత్ర కూడా వహించిన ఆయన పగటి నాటకానికి ఎవరూ పోవటం లేదు. తన ధోరణికి పరాకాష్ఠ అన్నట్లు ట్రంప్ ఈ నెల అన్న మాటలను గమనించండి. ఇరాన్‌లో నాయకత్వ లోటు ఏర్పడినందున తనను సుప్రీం లీడర్‌గా రావలసిందని కోరుతున్నారట. తాను ఒప్పుకోవటం లేదట.

ఇది హాస్యం కోసం అన్నదని ఎవరైనా కొట్టి వేయవచ్చు. కాని, వెనిజువెలాను ఇక తానే నడపనున్నానని, క్యూబాను చేతిలోకి తీసుకోగలనని, పనామా కాల్వను, కెనడాను, గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించగలనని ఆ దిశలో ప్రయత్నాలు కూడా చేసిన వ్యక్తికి మనసులో అటువంటి ఆలోచనలు ఉన్నాయన్న మాట. తన స్వభావమే అదన్నమాట. అందుకే ఆయన తనకు ఎటువంటి అంతర్జాతీయ చట్టాలన్నా లెక్కలేదని, తన మనసుకు తోచిందే చేస్తానని బాహాటంగా ప్రకటించారు. దీనంతటిని బట్టి అనిపించేదేమిటి? ఇరాన్ విషయమై తను, ఇజ్రాయెల్ ప్రధాని కలిసి ఒక లక్షంగా ప్రకటించిన రాజ్య వ్యవస్థ మార్పు (రెజీమ్ ఛేంజ్) ఒకవేళ నిజంగా జరిగినట్లయితే, అపుడు ట్రంప్ ఆ దేశానికి తనను తానే సుప్రీం లీడర్‌గా ప్రకటించుకుంటే ఆశ్చర్యపడవలసింది ఉండదు. ఈ రహస్య ఉద్దేశంతోనే కావచ్చు, ఇరాన్‌లో నాయకత్వ శూన్యత ఏర్పడిందని, మాజీ రాజవంశానికి చెందిన రెజా పహ్లవీకి దేశంలో తగినంత మద్దతు లేదని ఆయన ఈ మధ్య అంటున్నారు. ట్రంప్ వంటి వ్యక్తి ఎందుకైనా తగును.

ఇతర విషయాలలోకి వెళ్లే ముందు, ఇరాన్‌తో చర్చల కోసం షరతులంటూ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన వాటిని, తన షరతులంటూ ఇరాన్ ముందు పెట్టిన వాటిని గమనించండి. వాటిలో అత్యధికం రాజీకి వీలుపడనివే. ఎపుడైనా చర్చలంటే ఇరుపక్షాలు మొదట కొన్ని షరతులు పెట్టడం, చర్చల క్రమంలో కొన్ని రాజీలు కుదరటం సాధారణంగా జరిగేదే. కాని, ఉభయులకూ వారి మౌలిక ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. వాటిపై రాజీ అన్నది అసంభవం. అటువంటి అంశాలు ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌లు రెండింటి జాబితాలలో ఉన్నాయి. అమెరికా 15 షరతులలో 4 విధాలైనవి ఉన్నాయి. ఒకటి, అణుశక్తి. రెండు, క్షిపణులు. మూడు, హెజ్బొల్లా, హూతీ వంటి అనుబంధ మిలిటెంట్ సంస్థలు. నాలుగు, హర్మూజ్ జలసంధి. అమెరికా ఈ నాలుగింటిని షరతులుగా మార్చిందంటేనే రెండవ వైపు నుంచి చూసినపుడు ఇరాన్‌కు అవి అంత కీలకమైనవి అన్నమాట. బయటి వారుగా ఆలోచించినట్లయితే మనకు అనిపించేది కూడా అదే. అటువంటపుడు ఇరాన్ ఎట్లా రాజీ పడగలదు.

ఇరాన్‌లోని అణుశుద్ధి కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయాలని, ఇప్పటికే శుద్ధి అయిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించాలని, భవిష్యత్‌లో ఎన్నడు కూడా అణ్వస్త్రాలు తయారు చేయబోమంటూ ఒప్పుకోవాలని అమెరికా అంటున్నది. ఇందుకు ఇరాన్ గతం నుంచే చెప్తూ వస్తున్న దేమిటో తెలిసిందే. సామూహిక మానవ హననం చేసే అణ్వస్త్రాల తయారీ ఇస్లాం మతానికే విరుద్ధమన్న గత సుప్రీం లీడర్ ఖమేనీయే వాటి ఉత్పత్తిని నిషేధిస్తూ ఫత్వా జారీ చేశారు. దేశ రక్షణకు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ముప్పు పెరుగుతున్నందున ఆ నిషేధాన్ని సడలించాలంటూ అంతర్గతంగా ఒత్తిడులు పెరుగుతుండినా అంగీకరించిలేదు. అదే ఫత్వాకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నందున అణ్వస్త్రాల తయారీ ప్రసక్తే లేదు. కనుక ఆ షరతును ఇప్పుడు కొత్తగా అంగీకరించవలసిన అవసరం లేదు.

అదట్లుండగా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తాము 1970 లోనే సంతకం చేశాము. ఆ ఒప్పందంలో సభ్యులైన దేశాలకు యురేనియంను శాంతియుత వినియోగం కోసం శుద్ధి చేసుకునే హక్కు పూర్తిగా ఉంటుంది. అటువంటి శుద్ధిని పర్యవేక్షించే అధికారం అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉంటుంది. అదే ప్రకారం జరుగుతూ వస్తున్నది కూడా. అణ్వస్త్రాల కోసం 90 శాతం శుద్ధి అవసరం కాగా, తాము ఎప్పుడూ 60 శాతానికి మించలేదు. దానిని అంతకన్న కూడా తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు, ప్రస్తుత యుద్ధానికి ముందు అమెరికాతో ఒమన్ మధ్యవర్తిత్వం ద్వారా జరుగుతుండిన చర్చలతో సూచించాము. అదే మాట అమెరికన్ ప్రతినిధులూ అన్నారు. అటువంటపుడు, మేమసలు అణుశుద్ధి చేయరాదని, శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేయాలని షరతులు విధించటంలో ఉద్దేశమేమిటి? అది మాకెట్లా ఆమోదయోగ్యమవుతుంది? ఎన్‌పిటి సంతకందారులుగా, ఒక స్వతంత్ర దేశంగా మా అవసరాల రీత్యా, మా హక్కుల మాటేమిటి? అసలు మాకు ఈ షరతులు విధించటానికి అమెరికా గాని, మరొకరు గాని ఎవరు? అన్నది ఇరాన్ గతం నుంచి చేస్తున్న వాదన.

ఈ సూటి ప్రశ్నలకు అమెరికా సూటి సమాధానాలు ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు తిరిగి చర్చలు జరిగినా చెప్పగలగటం అనుమానమే. ఇందులోని విచిత్రమేమంటే, ఇజ్రాయెల్ అణ్వాయుధాల తయారీకి పాశ్చాత్య దేశాలు స్వయంగా సహకరించాయి. ఆ దేశం ఎన్‌పిటిపై సంతకం నేటికీ చేయకపోయినా అందుకు ఒత్తిడి చేయటం లేదు. ఈ ద్వంద్వ నీతిలో రహస్యమేమీ లేదు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక స్వతంత్ర విధానం గల దేశం కాగా, ఇజ్రాయెల్ తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం నమ్మినబంటుగా వ్యవహరిస్తున్నది. అది ఏ మాత్రం దాపరికం లేకుండా వారే చెప్తున్న మాట.

ఈ వివరాలన్నీ చూసిన మీదట, ఇపుడు అమెరికన్ల అణు సంబంధ షరతులకు ఇరాన్ అంగీకరించేదీ లేనిదీ ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. ఆ తర్వాత అంశం క్షిపణులు. యుద్ధాలలో గాని, ఆత్మరక్షణకు గాని ఒకప్పుడు పదాతి దళాలు, నావికా బలం, ట్యాంకులు, సాయుధ శకటాలు, వైమానిక బలం ప్రధానంగా ఉండేవి. క్రమంగా క్షిపణులు, వార్‌హెడ్స్, సైబర్ నైపుణ్యాలు మొదటి వరుసలోకి వస్తున్నాయి. డ్రోన్స్ కూడా. ప్రస్తుతం ఇరాన్ ఆత్మరక్షణ యుద్ధం క్షిపణులు, వార్‌హెడ్స్, డ్రోన్లపై ఆధారపడి అసమతుల వ్యూహం (అసిమ్మెట్రిక్‌గా) సాగుతున్నది. అటువంటప్పుడు, ఇరాన్ తన క్షిపణి శక్తిని పరిమితం చేయాలని, తాము నిర్ణయించిన శక్తి మాత్రమే ఉండాలని అమెరికా షరతు విధించడమంటే అర్థమేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఆ తర్వాత డ్రోన్ల ఉత్పత్తినీ పరిమితం చేయాలంటారు. వరుస దాడులతో సైనిక స్థావరాలను, వైమానిక, నౌకా స్థావరాలను, ఆయుధ కర్మాగారాలను ఇప్పటికే ధ్వంసం చేస్తున్నారు.

ఇక ఇరాన్‌కు మిగిలేదేమిటి? ట్రంప్ తనతో ఒక మాట అన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వెల్లడించారు. తాము ఏ లక్షాలనైతే యుద్ధం ద్వారా సాధించాలనుకుంటున్నామో వాటినన్నింటిని యుద్ధ విరమణ ఒప్పందం ద్వారా నెరవేర్చజూస్తున్నామని. అందుకు నెతన్యాహూ సంతృప్తి చెందారట. ఇటువంటి షరతులకు ఇరాన్ నాయకత్వం అంగీకరించటమంటే ఆత్మహత్య చేసుకోవటమే. ఆ తర్వాత ఇరాన్ జాతి అమెరికాకు సామంత జాతిగా మారటమే. ఇక పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, యూరప్‌లకుగాని, ఇప్పటికే వారి సామంతులుగా మారిన గల్ఫ్ షేక్‌లకు గాని ఇక ఎదురులేకపోవటమే. అంతే ముఖ్యంగా, ఇక పాలస్తీనా ఎప్పటికీ స్వతంత్ర దేశం కాకపోవటం, గ్రేటర్ ఇజ్రాయెల్ అవతరణకు మార్గం సుగమం కావటమే. బహుళ ధ్రువ ప్రపంచ లక్షం సాకారం కావటంలో ఒక ప్రధాన శక్తి అయిన ఇరాన్ పరిస్థితి అట్లా కావడమంటే, ఆ లక్ష సాధన ఆ మేరకు దెబ్బతిని సామ్రాజ్యవాదం బలపడినట్లే.

ఇటువంటి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అమెరికా ప్రతిపాదించిన ఈ సోకాల్డ్ శాంతి ప్రతిపాదనలలో చివరి ఎత్తు గత, ఇరాన్ భౌగోళిక సమగ్రతలో భాగమైన హర్మూజ్ జలసంధిపై హక్కును వదలుకోవాలనటం. ఆ జలసంధి, అందులోని ఖర్గ్ తదితర దీవులు ఇరాన్‌కు భౌగోళిక సమగ్రత, ఆర్థిక ప్రయోజనాల కోసం అతి కీలకమైనవి. వాటన్నింటిని వదలుకోవాలన్న ట్రంప్ చాలా తెలివికలవాడే కావచ్చుగాని, ఆ షరతులను అంగీకరించేందుకు ఇరాన్ నాయకత్వం తెలివి తక్కువదని భావించగలమా? అంతేకాదు, అసమతల యుద్ధ వ్యూహాలతో నెల రోజుల పాటు ధిక్కరించి ఎదురు నష్టాలు చేస్తూ, ఏవో కొన్ని రాజీలకు సమ్మతించవచ్చుగాని, ఆత్మహత్యాసదృశమైన వాటికి కూడానా? చర్చలకోసం ట్రంప్ షరతులు 15 కాగా, ఇరాన్ 5 మాత్రమే ప్రతిపాదించింది. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశుద్ధి హక్కు తమకు ఉండాలి.

క్షిపణి పరిమితులను అంగీకరించబోము. హర్మూజ్ తమది మాత్రమే. తమ అనుబంధ మిలిటెంట్ సంస్థలపై దాడులు జరపరాదు. తమపై గల ఆంక్షలు పూర్తిగా ఎత్తి వేయాలి. చివరన కీలకమైనది, గల్ఫ్ దేశాలలోని సైనిక స్థావరాలన్నీ రద్దు చేయాలి. వీటికి ట్రంప్ అవునంటారని భావించగలమా? దీనంతటి అర్థం స్పష్టమే. ఏవైనా అరకొరగా తప్ప ప్రధానమైన అంశాలపై రాజీలు కుదిరే అవకాశాలు కన్పించవు. యుద్ధం ఇదే విధంగా కొనసాగితే ఎవరికి కలిగే నష్టాలు ఎంత? ప్రపంచానికి నష్టాలేమిటి? చివరకు యుద్ధం ఏ విధంగా ముగియవచ్చునన్నది ఊహించలేని విషయం. ఆలోగా ఒత్తిడి మాత్రం అందరిపైనా పెరగనున్నది. అమెరికా, ఇజ్రాయెల్ అంచనా ప్రకారం ఇరాన్ కుప్పకూలిపోలేదన్నది మాత్రం ఈ మొదటి నెల యుద్ధం తర్వాత కనిపిస్తున్న వాస్తవం.  

– టంకశాల అశోక్ ( దూరదృష్టి)

– రచయిత సీనియర్ సంపాదకులు